Kaziranga: కజిరంగా నేషనల్ పార్క్‌లో షాకింగ్ ఘటన.. జీపులోంచి ఒంటి కొమ్ము ఖడ్గమృగాల ముందు పడ్డ తల్లీకూతురు.. ఆ తర్వాత జరిగింది ఇదీ!
- ఒంటి కొమ్ము ఖడ్గమృగాలకు నిలయం కజిరంగా నేషనల్ పార్క్
- ఇక్కడ సందర్శకులకు అందించే జీప్ సఫారీ రైడ్ చాలా స్పెషల్
- అలా జీపు సఫారీ చేస్తున్న సమయంలో అందులోంచి కింద పడ్డ తల్లీకూతురు
- తోటి పర్యాటకులు కాపాడటంతో త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డ వైనం
అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్ ఒంటి కొమ్ము ఖడ్గమృగాలకు నిలయం అనే విషయం తెలిసిందే. ఇక్కడి స్పెషల్ జీప్ సఫారీ రైడ్ సందర్శకులకు ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు, ఇతర జంతువులను చూసే అవకాశాన్ని కల్పిస్తుంది. అయితే, తాజాగా కజిరంగా నేషనల్ పార్క్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
సందర్శకులు జీపు సఫారీ చేస్తున్న సమయంలో తల్లీకూతురు ప్రమాదవశాత్తు అందులోంచి కింద పడిపోయారు. అప్పటికే జీపు వెనుకవైపు ఓ ఒంటి కొమ్ము ఖడ్గమృగం తరుముకుంటూ వస్తోంది. ఇక ఆ జీపు పక్కవైపు నుంచే మరో ఒంటి కొమ్ము ఖడ్గమృగం వెళుతోంది. దాంతో కిందపడ్డ ఇద్దరు సహాయం కోసం కేకలు వేశారు.
వెంటనే అప్రమత్తమైన పర్యాటకులు వారిని కాపాడారు. దాంతో త్రుటిలో వారిద్దరూ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ఘటన కజిరంగా నేషనల్ పార్క్‌లోని బగోరి పరిధిలో జరిగినట్లు సమాచారం. ఓ పర్యాటకుడు ఈ భయానక సంఘటనను తన కెమెరాతో చిత్రీకరించాడు. ఆ తర్వాత సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.