Stock Market: చైనా హెచ్ఎంపీవీ వైరస్ ప్రభావం... రూ.12 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి
- భారత్‌లో మూడు హెచ్ఎంపీవీ కేసులు నమోదు
- మార్కెట్‌పై ప్రభావం చూపిన వైరస్
- ఆసియా మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు
చైనాలో పుట్టిన హెచ్ఎంపీవీ వైరస్ కేసులు భారత్‌లో నమోదు కావడంతో స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. మన దేశంలో మూడు హెచ్ఎంపీవీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నది. అన్ని రంగాలు కూడా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. వైరస్‌కు తోడు ఆసియా మార్కెట్ నుంచి బలహీన సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు భారీ నష్టాలను మిగిల్చాయి.
మార్కెట్ భారీ నష్టాల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెట్ కంపెనీల మార్కెట్ వ్యాల్యూ దాదాపు రూ.12 లక్షల కోట్ల మేర క్షీణించింది. దీంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ వ్యాల్యూ రూ.439 లక్షల కోట్లకు తగ్గింది. హెచ్ఎంపీవీ వైరస్‌కు తోడు ఆసియా మార్కెట్ల బలహీన సంకేతాల ప్రభావంతో అన్ని రంగాలు నష్టాల్లోనే ముగిశాయి.
పీఎస్‌యూ బ్యాంకింగ్ రంగం 4 శాతం, మెటల్, రియాల్టీ, ఎనర్జీ, పీఎస్‌యూ, పవర్, ఆయిల్ అండ్ నేచరల్ గ్యాస్ రంగాలు 3 శాతం చొప్పున నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.4 శాతం, స్మాల్ క్యాప్ సూచీ 3 శాతం నష్టపోయాయి.