HMPV: బెంగళూరులో హెచ్ఎంపీవీ కేసులు... ఐసీఎంఆర్ స్పందన
- ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోన్న మరో వైరస్
- బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు హెచ్ఎంపీవీ వైరస్ పాజిటివ్
- హెచ్ఎంపీవీని ఎదుర్కొనేందుకు భారత్ సంసిద్ధంగా ఉందన్న ఐసీఎంఆర్
కరోనా మహమ్మారి దెబ్బకు హడలిపోయిన ప్రపంచ దేశాలను మరో వైరస్ కలవరపెడుతోంది. దాని పేరు హెచ్ఎంపీవీ (హ్యూమన్ మెటాన్యూమా వైరస్). చైనాలో ఈ వైరస్ తీవ్రస్థాయిలో ప్రబలుతోందంటూ ఇటీవల కథనాలు వచ్చాయి.
తాజాగా, భారత్ లోనూ హెచ్ఎంపీవీ వైరస్ కలకలం రేగింది. బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు హెచ్ఎంపీవీ వైరస్ సోకినట్టు తేలింది. ఈ నేపథ్యంలో భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఆసక్తికరంగా స్పందించింది. ప్రపంచ దేశాల్లోనే కాకుండా, భారత్ లోనూ ఈ వైరస్ వ్యాప్తిలో ఉందని వెల్లడించింది.
అయితే, ఇటువంటి శ్వాస సంబంధిత అనారోగ్యాలను ఎదుర్కొనేందుకు భారత్ అన్ని విధాలా సంసిద్ధంగా ఉందని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. హెచ్ఎంపీవీ సోకిన వారిలో ప్రధానంగా శ్వాస సంబంధిత సమస్యలు వస్తున్నట్టు ఇతర దేశాల్లో నమోదైన కేసుల ద్వారా అర్థమవుతోందని పేర్కొంది. తమ వద్ద అందుబాటులో ఉన్న డేటా మేరకు భయాందోళనలు కలిగించే స్థాయిలో పరిస్థితులేమీ లేవని ఐసీఎంఆర్ వెల్లడించింది.
హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని వైపుల నుంచి పరిస్థితులను నిశితంగా గమనిస్తోందని తెలిపింది. తాము కూడా ఏడాది పొడవునా హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తిపై ఓ కన్నేసి ఉంచుతామని పేర్కొంది.