Vijayasai Reddy: ఒకవేళ నేను అబద్ధం చెబితే వెంకటేశ్వరస్వామి నన్ను శిక్షిస్తాడు: విజయసాయిరెడ్డి
- కాకినాడ సీ పోర్ట్, సెజ్ వ్యవహారంలో ఈడీ కేసు
- నేడు హైదరాబాదులో విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
- విచారణ ముగిసిన అనంతరం ప్రెస్ మీట్
కాకినాడ సీ పోర్టు, సెజ్ కు సంబంధించి అక్రమంగా షేర్లను బదలాయించుకున్నట్టు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై కర్నాటి వెంకటేశ్వరరావు (కేవీ రావు) అనే వ్యక్తి ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేయడం తెలిసిందే. సీఐడీ కేసు ఆధారంగా ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో నేడు విజయసాయిరెడ్డి హైదరాబాదులో ఈడీ విచారణకు హాజరయ్యారు. విచారణ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తనను ఆరు గంటల పాటు ప్రశ్నించారని, 25 ప్రశ్నలు అడిగారని వెల్లడించారు. కేవీ రావు చేసిన ఆరోపణలపై ప్రశ్నించారని వివరించారు.
"ఓ ప్రజాప్రతినిధిగా నా వద్దకు ఎంతోమంది వస్తుంటారు. కొందరు అధికారులకు ఫోన్ చేసి పనులు అయ్యేలా చూడమని కోరుతుంటారు, మరికొందరు వ్యాపారవేత్తలకు ఫోన్ చేసి ఉద్యోగాలు ఇచ్చేలా చూడమని అడుగుతుంటారు. ఈ విధంగా ప్రతి రోజు నన్ను కోకొల్లలుగా కలుస్తుంటారు. ఈ క్రమంలో ఆయా వర్గాలకు నేను ఫోన్లు చేయడం జరుగుతుంది.
ఇక నా మీద ఉన్న ఆరోపణలు చూస్తే... కాకినాడ సీ పోర్ట్ విషయంలో కేవీ రావుకు నేను ఎలాంటి ఫోను చేయలేదు, విక్రాంత్ రెడ్డిని పంపిస్తానని చెప్పలేదు. ఇదే విషయాన్ని విచారణలో స్పష్టంగా చెప్పాను.
కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదులో ఏవైనా వాస్తవాలు ఉన్నట్టయితే... అతడి పేరు కె.వెంకటేశ్వరరావు కాబట్టి... అతడి పేరులో తిరుమల వెంకటేశ్వరస్వామి ఉన్నాడు కాబట్టి... ఆ కేవీ రావు తిరుమలకు వస్తే, నేను కూడా తిరుమలకు వెళతాను... తన ఫిర్యాదులో అ అంశాలు కరెక్టేనని ఆ దేవదేవుడైన వెంకటేశ్వరస్వామి సమక్షంలో చెప్పమనండి. ఆ ఫిర్యాదులోని అంశాలు వాస్తవమే అయితే... దేవుడు నాకు శిక్ష విధిస్తాడు, నా ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆ ఫిర్యాదులోని అంశాలు అవాస్తవాలే అయితే... కేవీ రావు అనే వ్యక్తిని దేవుడు శిక్షిస్తాడు.
కేవీ రావు చెబుతున్నట్టుగా... 2020 మే నెలలో నేను కేవీ రావుకు ఫోన్ చేసి ఉన్నట్టయితే కాల్ డేటా రికార్డ్స్ తెప్పించండి. అది వెరిఫై చేసి... నేను ఫోన్ చేసినట్టు నిర్ధారిస్తే... నేను తప్పు చేశానని ఒప్పుకుంటాను. నాకు తెలిసి కేవీ రావుకు నేను ఎప్పుడూ ఫోన్ చేయలేదు... ఈ విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెబుతున్నాను.
కేవీ రావు చెబుతున్నదే నిజమైతే... కేవీ రావును రమ్మనండి... నేను అతడ్ని క్రాస్ ఎగ్జామిన్ చేస్తాను, అతడు నన్ను క్రాస్ ఎగ్జామిన్ చేస్తాడు... అప్పుడు వాస్తవాలేంటనేది బయటపడతాయి అని ఈడీని కోరాను" అని విజయసాయిరెడ్డి వివరించారు.