KTR: విచారణ కోసం ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్... పోలీసులతో వాగ్వాదం

KTR arguments with ACB

  • న్యాయవాదుల సమక్షంలో విచారించాలని కేటీఆర్ డిమాండ్
  • తాను బయటకు రాగానే ఇంటిపై ఏసీబీ దాడులు జరపాలని నిర్ణయించారని ఆరోపణ
  • ప్రజాక్షేత్రంలో రేవంత్ పాలనలోని తప్పులు ఎండగడతామన్న కేటీఆర్

పార్ములా ఈ-కార్ రేసులో హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి విచారణకు హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... తనను న్యాయవాదుల సమక్షంలో విచారించాలని తాను ఏసీబీని కోరుతున్నానన్నారు. పట్నం నరేందర్ రెడ్డి ఇవ్వని స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు పోలీసులు సృష్టించారని, తనకు న్యాయవాదిని అనుమతించకపోవడంతో తన పట్ల కూడా అలాగే వ్యవహరిస్తారనే అనుమానం ఉందన్నారు.

తాను ఏసీబీ కార్యాలయానికి రాగానే తన ఇంటి మీద దాడులు జరపాలని నిర్ణయించారని ఆరోపించారు. తన ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన రెండు చిట్టీలు పెట్టి... కావాలని ఇరికించే ప్రయత్నాలు చేస్తారని అనుమానం వ్యక్తం చేశారు. నా హక్కుల కోసం నేను కొట్లాడతానన్నారు. న్యాయవాదుల సమక్షంలో తనను విచారించాలని కోరడంలో తప్పేముందని నిలదీశారు. రేవంత్ రెడ్డి పాలనలోని తప్పులను తాను ప్రజాక్షేత్రంలో నిలదీస్తామన్నారు.

ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్

ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్ తన న్యాయవాదులతో కలిసి ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు వెళ్లారు. అయితే న్యాయవాదులతో కలిసి రావడంపై పోలీసులు అభ్యంతరం తెలిపారు. దీంతో ఏసీబీ ప్రధాన కార్యాలయం వద్ద తీవ్ర ఉత్కంఠ కనిపించింది.

తన హక్కులను వినియోగించుకుంటానని పోలీసులను కేటీఆర్ కోరారు. తనతో పాటు న్యాయవాదులను అనుమతించాలని కోరారు. కానీ పోలీసులు ససేమీరా అన్నారు. విచారణకు ఒక్కరికే అనుమతి ఉందని పోలీసులు స్పష్టం చేశారు. పోలీసుల తీరుపై కేటీఆర్ అభ్యంతరం తెలిపారు. తనతో పాటు న్యాయవాదులను అనుమతించాల్సిందేనని పట్టుబట్టారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది.

న్యాయవాదులతో కలిసి తనను అనుమతించాలని పోలీసులను డిమాండ్ చేస్తూ ఆయన కాసేపు ఏసీబీ కార్యాలయం ఎదుటే వేచి చూశారు. చట్టం ప్రకారం తనకు ఉన్న హక్కులను ఉపయోగించుకోనివ్వాలన్నారు.

న్యాయవాదిని అనుమతించకపోవడంపై ఆయన రోడ్డు పైనే తన నిరసనను తెలిపారు. తన స్పందనను రాతపూర్వకంగా పోలీసులకు అందించారు. చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలన్నారు. న్యాయవాదితో కలిసి తనను లోనికి అనుమతించకపోవడంతో ఆయన వెనక్కి వెళ్లారు. ఏసీబీ కార్యాలయం నుంచి నేరుగా తెలంగాణ భవన్‌‍కు వెళ్లారు. 

  • Loading...

More Telugu News