Amit Shah: 2026 మార్చి నాటికి దేశంలో నక్సల్స్ కథ ముగిస్తాం: అమిత్ షా
- ఛత్తీస్ గఢ్ లో పంజా విసిరిన మావోలు
- 9 మంది జవాన్ల మృతి
- వచ్చ ఏడాది కల్లా దేశంలో నక్సలిజాన్ని నిర్మూలిస్తామన్న అమిత్ షా
ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులు పంజా విసిరిన ఘటనలో 9 మంది జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో స్పందించారు. వచ్చే ఏడాది కల్లా దేశంలో మావోయిస్టులు ఎవరూ ఉండరని స్పష్టం చేశారు. దేశంలో 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని చెప్పారు.
నక్సల్స్ దాడిలో జవాన్ల మృతి పట్ల అమిత్ షా సంతాపం తెలియజేశారు. బీజాపూర్ జిల్లాలో నక్సల్స్ ఐఈడీ పేలుడుకు పాల్పడిన నేపథ్యంలో డీఆర్ జీ జవాన్లు మృతి చెందడం తనను తీవ్ర విచారానికి గురిచేసిందని పేర్కొన్నారు. ఆ వీర జవాన్ల కుటుంబాల్లో నెలకొన్న వేదనను మాటల్లో చెప్పలేమని పేర్కొన్నారు. వీర జవాన్ల ప్రాణత్యాగాలు వృథా కానివ్వబోమని ప్రతిజ్ఞ చేశారు. భారతదేశ గడ్డపై నక్సల్స్ ను పూర్తిగా తుడిచిపెట్టేస్తామని స్పష్టం చేశారు.