Rohit Sharma: ఆసీస్ ఎత్తుగడలకు రోహిత్ శర్మ బలయ్యాడన్న మాజీ స్పిన్నర్
- బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ శర్మ ఘోర వైఫల్యం
- 3 టెస్టుల్లో 31 పరుగులే చేసిన హిట్ మ్యాన్
- ఆసీస్ విసిరిన వలలో రోహిత్ శర్మ చిక్కుకున్నాడన్న ఒకీఫే
- ఏకంగా చివరి టెస్టుకు జట్టులో స్థానమే కోల్పోయాడని వెల్లడి
తమ దేశంలో పర్యటించేందుకు ఏ ఇతర జట్లు ఇచ్చినా ఆస్ట్రేలియా జట్టు ఆనవాయతీగా కొన్ని ఎత్తుగడలు ప్రయోగిస్తుంటుందని ఆసీస్ మాజీ స్పినర్ కెర్రీ ఒకీఫే పేర్కొన్నాడు. ప్రత్యర్థి జట్ల కెప్టెన్లను మానసికంగా దెబ్బతీయడమే ఆ ఎత్తుగడల లక్ష్యమని తెలిపాడు. ఈసారి ఆ ఎత్తుగడలకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బలయ్యాడని వెల్లడించాడు.
ఆ ఎత్తుగడలు బుమ్రాపై పనిచేయలేదని, అతడి గట్టివాడని ఒకీఫే వ్యాఖ్యానించాడు. తొలి టెస్టులో టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరించిన బుమ్రా... జట్టును గెలిపించి, రెండో టెస్టుకు రోహిత్ శర్మకు కెప్టెన్సీ అప్పగించాడని.. కానీ ఆస్ట్రేలియన్ల సంప్రదాయ ఎత్తుగడల వలకు రోహిత్ శర్మ చిక్కుకున్నాడని వివరించాడు. ఆ దెబ్బకు అతడు చివరి టెస్టుకు ఏకంగా జట్టులోనే స్థానం కోల్పోవాల్సి వచ్చిందని అన్నాడు.
ఇలాంటి ప్రణాళికలు ఆస్ట్రేలియా జట్టు వద్ద చాలానే ఉన్నాయని, గతంలో, మాజీ పేసర్ గ్లెన్ మెక్ గ్రాత్ ప్రత్యర్థి జట్టు కెప్టెన్ ను తాను ఎన్నిసార్లు అవుట్ చేయబోతున్నానో ముందే చెప్పేవాడని, అలాంటి వ్యూహాలు ప్రత్యర్థి జట్లపై ప్రభావం చూపించేవని ఒకీఫే అభిప్రాయపడ్డాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లో 3 టెస్టులాడిన రోహిత్ శర్మ 6.20 సగటుతో కేవలం 31 పరుగులు చేశాడు. దాంతో అతడిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. చివరి టెస్టుకు బలవంతంగా దూరం కావాల్సి వచ్చింది. ఈ ఐదు టెస్టుల సిరీస్ లో టీమిండియా 1-3తో ఘోర పరాభవం చవిచూసిన సంగతి తెలిసిందే.