Bird Flu: బర్డ్ ఫ్లూతో అమెరికాలో తొలి మరణం
- లూసియానాలో బర్డ్ ఫ్లూతో మరణించిన 65 ఏళ్ల వృద్ధుడు
- డిసెంబర్ నెల మధ్యలో ఆసుపత్రిలో చేరిక
- దేశంలో ఇదే తొలి సీరియస్ బర్డ్ ఫ్లూ కేసు అని అప్పట్లో సీడీసీ ప్రకటన
మనుషుల్లో తొలి బర్డ్ ఫ్లూ (హెచ్5ఎన్1) మరణం అమెరికాలో నమోదైంది. లూసియానాలో ఈ వైరస్ సోకిన ఓ వ్యక్తి (65) చికిత్స పొందుతూ మృతి చెందాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతోపాటు పలు ఇతర సమస్యలతో డిసెంబరు నెల మధ్యలో ఆయన ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు బర్డ్ ఫ్లూ సోకినట్టు నిర్ధారించారు. దేశంలో ఇదే తొలి సీరియస్ బర్డ్ ఫ్లూ కేసు అని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ఇటీవల ప్రకటించింది. తాజాగా ఆయన మరణించినట్టు వైద్యులు ప్రకటించారు.
పెరట్లో ఉన్న అడవి పక్షులు, మందకు దగ్గరగా వెళ్లడం వల్లే ఆయన ఈ వైరస్ బారినపడినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఆయన నుంచి మరో వ్యక్తికి ఈ వైరస్ సోకినట్టుగా ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. కాగా, గతేడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అమెరికాలో 66 బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి.