Delhi Assembly polls: నేడే ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన
- మధ్యాహ్నం 2 గంటలకు ప్రకటించనున్న ఈసీ
- ఫిబ్రవరి 15తో ముగియనున్న ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం
- ఇప్పటికే హోరాహోరీగా ప్రచారం చేస్తున్న ఆప్, బీజేపీ
కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇవాళ (మంగళవారం) వెలువడనుంది. మధ్యాహ్నం 2 గంటలకు షెడ్యూల్ ను ప్రకటించనున్నట్టు భారత ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీలో ప్రస్తుతం కొనసాగుతున్న 7వ అసెంబ్లీ పదవీకాలం ఫిబ్రవరి 15తో ముగిసిపోనుంది. ఆ లోగా తదుపరి అసెంబ్లీ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఫిబ్రవరి తొలి వారంలోనే ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.
డిసెంబర్ నెల నుంచే అధికార ఆప్, ప్రధాన విపక్షమైన బీజేపీ హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. వరుసగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలంటున్న ఆప్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఎన్నికల హామీలుగా ఇప్పటికే పలు సంక్షేమ పథకాలను ప్రకటించింది. ఢిల్లీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని, ఆప్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ఒక్కసారి తమకు అవకాశం ఇవ్వాలని ప్రధాని మోదీ సహా ఆ పార్టీ ఇతర నేతలు ఓటర్లను కోరుతున్నారు.
కాగా, లోక్సభ ఎన్నికల సమయంలో ఆప్తో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఒంటరిగా పోటీ చేస్తోంది. హస్తం పార్టీ ఇప్పటికే తొలి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.