Yuvraj Singh: రోహిత్‌, కోహ్లీ గ‌తంలో ఏం సాధించారో అంద‌రూ మ‌రిచిపోయారు: యువ‌రాజ్ సింగ్‌ కీల‌క వ్యాఖ్య‌లు

Yuvraj Singh defends Virat Kohli and Rohit Sharma

  • బీజీటీలో టీమిండియా ఓటమిపై వెల్లువెత్తుతున్న విమర్శలు 
  • సీనియ‌ర్లు రోహిత్, కోహ్లీ ఘోరంగా విఫ‌లం కావ‌డాన్ని జీర్ణించుకోలేక‌పోతున్న ఫ్యాన్స్‌
  • ఈ ఇద్ద‌రికి మద్దతుగా నిలిచిన యువ‌రాజ్ సింగ్‌

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఓటమిపై విమర్శలు వెల్లువెత్తుతున్న విష‌యం తెలిసిందే. ప్ర‌ధానంగా సీనియ‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ ఈ సిరీస్‌లో ఘోరంగా విఫ‌లం కావ‌డాన్ని అంద‌రూ త‌ప్పుబ‌డుతున్నారు. ఈ నేపథ్యంలో రోహిత్, కోహ్లీకి మాజీ టీమిండియా క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్‌ మద్దతుగా నిలిచాడు. వారిద్ద‌రూ గ‌తంలో ఏం సాధించారో ప్ర‌జ‌లు మ‌రిచిపోయార‌ని యువీ వ్యాఖ్యానించాడు.

ది టెన్నిస్ బాల్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ (టీబీసీపీఎల్‌) ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు యువరాజ్ సింగ్ దుబాయ్ చేరుకున్నాడు. ఈ సందర్భంగా యువ‌రాజ్ మాట్లాడుతూ.. "గత ఐదారేళ్లలో భారత్‌ సాధించిన విజయాలు అత్యద్భుతం. ఆస్ట్రేలియాలో రెండు వరుస విజయాలు సాధించాం. నాకు తెలిసి.. మరే ఇతర జట్టు కూడా అలా చేసింది లేదు. ఇప్పుడు ఒక్క ఓట‌మితో మన గొప్ప ఆట‌గాళ్ల గురించి చెడుగా మాట్లాడుతున్నాం. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి ఆటగాళ్లు పర్ఫామెన్స్ చేయనప్పుడు వారిని విమర్శించడం చాలా తేలిక. కానీ, గ‌తంలో వారిద్ద‌రూ జ‌ట్టు కోసం ఏం చేశారు అనే దాన్ని ప్ర‌జ‌లు మ‌రిచిపోయారు. 

ఈ క్రికెటర్లు త‌మ కుటుంబం కంటే కూడా జట్టుతోనే ఎక్కువ‌గా ఉంటారు. దేశం కోసం ఏం చేయ‌డానికైనా వారు వెన‌కాడ‌రు. టీమిండియా త‌ప్ప‌కుండా ఈ ఓట‌మి నుంచి తేరుకుని బ‌లంగా తిరిగొస్తోంది. కోచ్ గా గౌతం గంభీర్‌, సెల‌క్ట‌ర్‌గా అజిత్ అగార్క‌ర్‌, కీల‌క ప్లేయ‌ర్లు రోహిత్‌, కోహ్లీ, జ‌స్ప్రీత్ బుమ్రా ఉన్న భార‌త జ‌ట్టు క‌మ్‌బ్యాక్ సాలిడ్ గా ఉంటుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఆఖ‌రి టెస్టులో కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శ‌ర్మ ఫామ్‌లేక త‌ప్పుకోవ‌డం నిజంగా గ్రేట్‌. అత‌డు త‌న కంటే కూడా జ‌ట్టుకు తొలి ప్రాధాన్యం ఇచ్చాడు. రోహిత్ నిర్ణ‌యాన్ని త‌ప్పు ప‌ట్ట‌డం స‌రైంది కాదు. 

అత‌ను గొప్ప కెప్టెన్‌. రోహిత్ కెప్టెన్సీలోనే మ‌నం వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫైన‌ల్‌కి వెళ్లాం. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ గెలిచాం. ఒక్క సిరీస్ ఓడినంత మాత్రా‌న పోయిందేం లేదు. కానీ, స్వ‌దేశంలో న్యూజిలాండ్ చేతిలో ఓట‌మి అనేది కొంచెం బాధించింది. ఇక ఆట‌గాళ్లు మంచి ప్ర‌ద‌ర్శ‌న చేయ‌నప్పుడు విమ‌ర్శించ‌డం చాలా ఈజీ. కానీ, మ‌ద్ద‌తుగా నిల‌వ‌డం చాలా క‌ష్టం. నేను మాత్రం ఎప్పుడు  నా మిత్రుల‌కు స‌పోర్ట్‌గానే మాట్లాడుతాను. వారు నా కుటుంబ స‌భ్యులు" అని యువీ చెప్పుకొచ్చాడు.  

  • Loading...

More Telugu News