Pawan Kalyan: పవన్ ప్రకటించిన పరిహారాన్ని అందజేసిన జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్
- గేమ్‌ఛేంజర్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు అభిమానులు
- బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్
- మణికంఠ, చరణ్ కుటుంబాలకు ఆర్ధిక సాయం చెక్కులు అందజేసిన ఎంపీ
ఈ నెల 4న రాజమహేంద్రవరం శివారులో గేమ్‌ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హజరై తిరిగి వెళుతున్న క్రమంలో కాకినాడకు చెందిన ఇద్దరు అభిమానులు టి.చరణ్, ఎ.మణికంఠ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. వీరి మృతిపై ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ తరపున వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్ధిక సాయం ప్రకటించారు.
ఈ క్రమంలో సోమవారం మృతుల కుటుంబాలను జనసేన కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పరామర్శించారు. పార్టీ అధినేత పవన్ ప్రకటించిన పరిహారం చెక్కులను బాధిత కుటుంబాలకు అందజేశారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎంపీ భరోసా ఇచ్చారు.
కాగా, మృతుల కుటుంబాలకు నటుడు రామ్ చరణ్, నిర్మాత దిల్ రాజు కూడా ఇప్పటికే రూ.5 లక్షల వంతున ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు. అభిమానులు మృతి చెందిన విషయం తెలుసుకున్న రామ్ చరణ్ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేయడంతో పాటు తన సన్నిహితులను అభిమానుల ఇంటికి పంపి ధైర్యం చెప్పించారు.