Harish Rao: ఫార్ములా ఈ-రేస్ కేసు.. కేటీఆర్‌ ఇంటి వెలుపల హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు

Harish Rao said that he will continue questioning Revanth Reddy even if he makes arrests or files 100 cases
  • తప్పు చేసినట్టుగా హైకోర్ట్ చెప్పలేదన్న హరీశ్ రావు
  • కేసు విచారణ కొనసాగించడానికే అనుమతించిందని వ్యాఖ్య
  • వంద కేసులు పెట్టినా రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూనే ఉంటామన్న మాజీ మంత్రి
ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నిసార్లు అరెస్టులు చేసినా, వంద కేసులు పెట్టినా రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూనే ఉంటామని ఆయన అన్నారు. కేసు విచారణ కొనసాగించడానికి హైకోర్ట్ అనుమతించిందని, తప్పు చేసినట్టుగా ఎక్కడా చెప్పలేదని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ఈ-రేస్‌తో రాష్ట్రానికి లాభం జరిగిందని, నష్టం జరగలేదని ఆయన పేర్కొన్నారు. అసలు అవినీతే జరగనప్పుడు ఈ కేసుకు ఆస్కారం ఎక్కడ ఉంటుందని హరీశ్ రావు ప్రశ్నించారు.  

రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని హరీశ్ ఆరోపించారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని, అక్రమ అరెస్టులతో ప్రభుత్వ తప్పులను కప్పిపుచ్చుకోవాలని రేవంత్ భావిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. అవినీతి జరగలేదని, గ్రీ‌న్ కో కంపెనీకి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని అన్నారు. ఈ కేసు వ్యవహారంలో సుప్రీంకోర్టు అప్పీలుకు పోవాలా? లేదా? అనేది న్యాయవాదుల సలహా మేరకు నిర్ణయం తీసుకుంటామని ఆయన వివరించారు. కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు నేపథ్యంలో నందినగర్‌లోని కేటీఆర్ నివాసానికి బీఆర్ఎస్ నేతలు తరలి వెళ్లారు. అనంతరం హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు.

మరోవైపు, ఫార్ములా ఈ-రేస్ కేసు విచారణలో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ కేసులో ఏ3గా ఉన్న హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏ2గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ నివాసంలో కూడా సోదాలు జరుగుతున్నాయి. వీరిద్దరూ గురువారం ఈడీ విచారణను ఎదుర్కోనున్నారు.
Harish Rao
KTR
BRS
Telangana

More Telugu News