AP Govt: గ్రీన్ స్కిల్లింగ్‌పై స్వనీతి ఇనిషియేటివ్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
- గ్రీన్ ఎనర్జీ రంగంలో యువతకు ఉపాధి కల్పనే లక్ష్యం
- మంత్రి లోకేశ్ సమక్షంలో స్వనీతి, ఏపీఎస్ఎస్డీసీ ఎంఓయూ
- పరిశోధన, డేటా, పబ్లిక్ సర్వీస్ డెలివరీలో స్వనీతి ఇనిషియేటివ్ సంస్థకు గొప్ప అనుభవం
రాష్ట్రంలో గ్రీన్ స్కిల్లింగ్ అభివృద్ధి కోసం స్వనీతి ఇనిషియేటివ్ సంస్థతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కీలక ఒప్పందం చేసుకుంది. ఉండవల్లి నివాసంలో రాష్ట్ర మానవవనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఈ మేరకు ఎంఓయూ కుదిరింది. ప్రముఖ సామాజిక సంస్థ అయిన స్వనీతి ఇనిషియేటివ్ రాష్ట్రంలో పౌరసేవలను మెరుగుపరిచి, అట్టడుగువర్గాల అభివృద్ధికి అవసరమైన విధానాల రూపకల్పన చేస్తుంది.
పరిశోధన, డేటా, పబ్లిక్ సర్వీస్ డెలివరీలో అనుభవం కలిగిన స్వనీతి ఇనియేటివ్ సంస్థ సమాజంలో వెనుకబాటుకు గురైన వారి జీవితాల్లో మార్పు కోసం కృషిచేస్తోంది. స్కిల్లింగ్‌కు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ వర్క్‌కు పూర్తిస్థాయి మద్దతు ఇస్తుంది. కీలకమైన రంగాలు, పరిశ్రమలను గుర్తించి, స్థిరమైన జాబ్ మార్కెట్‌ను ప్రోత్సహించడంపై దృష్టి సారిస్తుంది.
ఈ కార్యక్రమంలో స్వనీతి ఇనిషియేటివ్ ట్రస్టీ ఉమా భట్టాచార్య, స్టేట్ కన్సల్టెంట్ శివప్రసాద్, అసోసియేట్ తేజ సరియం, పాఠశాల విద్య, స్కిల్ డెవలప్ మెంట్ కార్యదర్శి కోన శశిధర్, స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎండీ గణేశ్ కుమార్, స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దినేశ్ కుమార్ పాల్గొన్నారు.
ఈ ఒప్పందం ప్రకారం స్వనీతి ఇనిషియేటివ్ సంస్థ వచ్చే 4 నెలల్లో పునరుత్పాదక ఇంధన రంగానికి సంబంధించి నైపుణ్యాభివృద్ధి వ్యూహం ముసాయిదాను రూపొందించి, వ్యూహం అమలుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేస్తుంది. ఇందుకోసం రెన్యువబుల్ ఎనర్జీ సెక్టార్ కోసం స్కిల్ ల్యాండ్ స్కేప్ అసెస్ మెంట్ చేస్తుంది. కీలకమైన వాటాదారులతో (పరిశ్రమ, పరిశ్రమ సంఘాలు, క్లస్టర్ సంఘాలు, శిక్షణా సంస్థలు - ఐటీఐలు, వీటీసీ, నైపుణ్య విశ్వవిద్యాలయాలు, ఇంజనీరింగ్ కళాశాలలు మొదలైనవి) సంప్రదింపులు జరిపి నివేదిక రూపొందిస్తుంది.
జర్మనీ, అమెరికా బృందాలు, సెక్టార్ నిపుణులు, గ్రీన్ ఎనర్జీ రంగ నిపుణుల ఆలోచనలను పంచుకునేందుకు కీలకమైన భాగస్వాములతో వర్క్‌షాప్‌లు కండక్ట్ చేస్తుంది. కీలక వాటాదారుల భాగస్వామ్యంతో వ్యూహాన్ని ఖరారు చేస్తుంది. ఏపీఎస్ఎస్డీసీ సంస్థ... తమ ప్రధాన కార్యాలయం నుంచి పని చేసే స్వనీతి బృందానికి ప్రత్యేకంగా నైపుణ్య గణన, ఇన్ సైట్ ఇన్ఫర్మేషన్, గ్రీన్ స్కిల్లింగ్ అభివృద్ధికి సంబంధించిన ఇతర సమాచారం అందిస్తుంది.
టెక్నికల్ కన్సల్టెంట్లు ఏపీఎస్ఎస్డీసీ తాడేపల్లి కార్యాలయంలో పనిచేయడానికి అవసరమైన స్థలాన్ని అందిస్తుంది. అనంతపురం, చిత్తూరు, వైఎస్ఆర్ కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లోని గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన ప్రభుత్వ శాఖల విశ్లేషణలు, వారితో సంప్రదింపుల కోసం సంబంధిత ప్రభుత్వ శాఖల యాక్సెస్ ఇచ్చి, సంబంధిత సమాచారాన్ని అందిస్తుంది.
స్వనీతి ఇనిషియేటివ్ సంస్థ చేపట్టే కార్యక్రమాలు
- 1. అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరులలో గ్రీన్ ఉద్యోగాల కల్పనకు గల అవకాశాలను అంచనా వేయడానికి బేస్‌లైన్ సర్వే నిర్వహిస్తుంది. అలాగే కాకినాడ, గోదావరి, వైజాగ్‌లలో గ్రీన్ ఎనర్జీ పరిశ్రమ, సంబంధిత నైపుణ్య అవకాశాలను కూడా అంచనా వేస్తుంది.
- 2. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రభుత్వ బాధ్యతలను వివరిస్తూ భవిష్యత్తు అభివృద్ధి అంచనాలను రూపొందిస్తుంది.
- 3. గ్రీన్ స్కిల్లింగ్ రంగంలో అభివృద్ధికి అనుగుణంగా ఏమేరకు మానవవనరులు అవసరమో గుర్తిస్తుంది.
- 4. గ్రీన్ ఎనర్జీ నైపుణ్య అవసరాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి, ఏపీఎస్ఎస్డీసీ నుంచి అవసరమైన డేటా లేదా సమాచారాన్ని సేకరించి విశ్లేషిస్తుంది.
- 5. ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో అమలుచేస్తున్న గ్రీన్ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లను సమీక్షిస్తుంది. నైపుణ్యం కలిగిన మానవ వనరులకు అవసరమైన విద్యా కార్యక్రమాలను అన్వేషిస్తుంది.
- 6. ఐటీఐలు, పాలిటెక్నిక్‌లు, స్కిల్ హబ్‌లు, స్కిల్ స్పోక్స్ మొదలైన వాటిలో పరిశ్రమల అలైన్డ్ ట్రైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేయడానికి ప్రోగ్రామ్ రూపకల్పనలో మద్దతునిస్తుంది.
- 7. నైపుణ్య శిక్షణ, ఉపాధికి సంబంధించి రాష్ట్రంలో సహకారాన్ని కలిగి ఉండటానికి జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమ సంస్థలతో అనుసంధానం చేయడంలో ఏపీఎస్ఎస్డీసీకి మద్దతునిస్తుంది.
- 8. కేంద్ర ప్రభుత్వ పథకాలను సమీక్షించి పబ్లిక్, నిరుద్యోగ యువత, నైపుణ్యం కలిగిన అభ్యర్థుల ఉపాధి కోసం పరిశ్రమతో పాటు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ తో అనుసంధానానికి ప్రణాళిక తయారీలో కీలకమైన ఇన్పుట్లను అందిస్తుంది.
- 9. సూచికల ప్రస్తుత స్థితి, పురోగతిని సమీక్షించడానికి సమగ్ర ప్రభావ అంచనాలను రూపొందిస్తుంది.
- 10. స్కిల్ అసెస్మెంట్, మ్యాపింగ్‌లో పేరొందిన ప్రీమియర్ అకడమిక్ ఇన్స్టిట్యూట్ల భాగస్వామ్యంతో అనుభవజ్ఞులైన సాంకేతిక కన్సల్టెంట్లను నియమిస్తుంది.