Mohammad Shami: ఇంతకీ మహ్మద్ షమీ ఏమైపోయాడు?: రవిశాస్త్రి
- 2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత జట్టుకు దూరమైన షమీ
- గాయంతో బాధపడుతూ ఎన్.సి.ఏలో రిహాబిలిటేషన్
- షమీ ఇప్పుడెక్కడున్నాడు అంటూ రవిశాస్త్రి వ్యాఖ్యలు
- తానైతే షమీని కూడా ఆసీస్ టూర్ కు ఎంపిక చేసేవాడ్నని వెల్లడి
టీమిండియాలో అగ్రశ్రేణి పేసర్ గా ఎదిగిన మహ్మద్ షమీ... 2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత గాయం బారినపడి పెద్దగా అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. షమీకి తగిలిన గాయం ఏంటో, అతడు ఎందుకు ఇన్నాళ్లు జట్టుకు దూరంగా ఉన్నాడో స్పష్టత లేదు. షమీ దేశవాళీ క్రికెట్ ఆడుతున్నా, ఫిట్ నెస్ లేదంటూ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి అతడ్ని పరిగణనలోకి తీసుకోలేదు. దీనిపై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించారు.
ఇంతకీ షమీ ఏమైపోయాడు అని ప్రశ్నించారు. షమీకి ఏమైందన్న విషయంపై మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని చూసి తాను ఆశ్చర్యపోయానని వెల్లడించారు. షమీ ఎక్కడున్నాడు? గాయం నుంచి కోలుకున్నాడా? జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లిన షమీ అక్కడ ఎన్ని రోజులు ఉన్నాడు? ఎందుకు షమీ గురించి సరైన సమాచారం బయటికి రావడంలేదు అని రవిశాస్త్రి ప్రశ్నించారు.
ఒకవేళ తనకే అధికారం ఉండుంటే, ఆస్ట్రేలియా టూర్ కోసం ఎంపిక చేసిన టీమిండియాలో షమీని కూడా చేర్చేవాడినని అన్నారు. అతడు కోలుకోకపోతే జట్టుతో పాటే ఉంటూ రిహాబిలిటేషన్ జరిగేలా చూసేవాడినని వివరించారు. షమీకి ఎంతో అనుభవం ఉందని, ఆస్ట్రేలియా టూర్ కు అతడ్ని కూడా ఎంపిక చేసి ఉంటే టీమిండియా బౌలింగ్ విభాగం చాలా బలంగా ఉండేదని అభిప్రాయపడ్డారు.