BJP: హెచ్ఎంపీవీ వైరస్‌ను తేలిగ్గా తీసుకోవద్దు: కర్ణాటక బీజేపీ హెచ్చరిక
- హెచ్ఎంపీవీని తేలిగ్గా తీసుకోవద్దన్న ప్రతిపక్ష బీజేపీ నేత అశోక
- ప్రజలు భయభ్రాంతులకు గురి కావొద్దనే ఉద్దేశంతో మంత్రి మాట్లాడారన్న బీజేపీ నేత
- కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసిందని వెల్లడి
హెచ్ఎంపీవీ వైరస్‌ను తేలిగ్గా తీసుకోవద్దని కర్ణాటక బీజేపీ హెచ్చరించింది. దేశంలో హెచ్ఎంపీవీ కేసులు నమోదవుతున్నాయి. బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు పాజిటివ్ అని తేలింది. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రతిపక్ష నేత (బీజేపీ) ఆర్.అశోక మాట్లాడుతూ... ఈ వైరస్‌ను తేలిగ్గా తీసుకోవద్దన్నారు. కొత్త వైరస్ పట్ల ప్రజలు భయాందోళనకు గురికావొద్దనే ఉద్దేశంతో మంత్రి దినేశ్ గుండూరావు అదేమంత ప్రమాదకరం కాదన్న రీతిలో మాట్లాడారన్నారు.
దాని గురించి ఏమీ తెలియనప్పుడు హెచ్ఎంపీవీని తేలికగా తీసుకోరాదన్నారు. హెచ్ఎంపీవీ చైనాలో బీభత్సం సృష్టిస్తోందన్నారు. అక్కడి చిన్నారులు ఆసుపత్రి పాలయ్యారని అన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసిందన్నారు.
వ్యాధి వచ్చినప్పుడు కాకుండా... రాకముందే జాగ్రత్తలు తీసుకోవడం మంచిదన్నారు. ఈ వైరస్ ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతోందన్నారు. జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. హెచ్ఎంపీవీని ఎలా ఎదుర్కోవాలో ప్రజలకు తెలియజేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్ల లభ్యత, ఐసీయూ బెడ్ల వంటి సదుపాయాలపై దృష్టి సారించాలన్నారు.