RS Praveen Kumar: రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గూండాయిజం చేస్తున్నారు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- మంచిర్యాలలో ప్రేమ్ సాగర్ రావు గూండాయిజం చేస్తున్నారని విమర్శ
- ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణంలో భూమిని కోల్పోతున్న వారికి పరామర్శ
- కాంగ్రెస్ నాయకుల భూముల్లో ఇండస్ట్రియల్ పార్క్ నిర్మించాలని సవాల్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో గూండాయిజం చేస్తున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. రాష్ట్రంలో సీఎం, మంచిర్యాలలో ప్రేమ్ సాగర్ రావు గూండాయిజం చేస్తున్నారన్నారు. ఈరోజు ఆయన మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్ మండలం గుడిపేట, వేంపల్లె గ్రామాల్లో దాదాపు 276 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణంలో భూమిని కోల్పోతున్న వారిని పరామర్శించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ... ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన ప్రజల భూములను ఎలాంటి నోటిఫికేషన్లు, జీవోలు లేకుండా లాక్కుంటున్నారని ఆరోపించారు. మంచిర్యాలలో స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రైతుల భూముల్లో కాదని... కాంగ్రెస్ నాయకుల భూముల్లో ఇండస్ట్రియల్ పార్క్ నిర్మించాలని సవాల్ చేశారు.
రేవంత్ రెడ్డి పాలనలో ఎస్సీలపై రోజురోజుకూ దాడులు పెరుగుతున్నాయన్నారు. ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో దళితుల భూములను కబ్జా చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బాధితుల వెంట మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారని హామీ ఇచ్చారు.