Earthquake: టిబెట్ పీఠభూమిలో భారీ భూకంపం... 95 మంది మృతి
- 7.1 తీవ్రతతో భారీ భూకంపం
- నేలమట్టమైన భవనాలు
- కొనసాగుతున్న సహాయక చర్యలు
- భారత్ లోనూ ప్రకంపనలు
శక్తిమంతమైన భూకంపం నేడు టిబెట్ ను కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రత నమోదైన ఈ భూకంపం కారణంగా 95 మంది మృత్యువాత పడ్డారు. 130 మంది గాయపడ్డారు. నేపాల్ సరిహద్దుకు సమీపంలో టిబెట్ పీఠభూమిలో నేటి ఉదయం భూకంపం సంభవించింది. టిబెట్ లోని షిజాంగ్ నగరానికి సమీపంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్ జీఎస్) గుర్తించింది.
ఒక్కసారిగా భూమి ఊగిపోవడంతో ప్రజలు ఇళ్లలోంచి పరుగులు తీశారు. అనేక భవనాలు నేలమట్టం అయ్యాయి. భారీ భూకంపం తర్వాత టిబెట్ భూభాగంలో భూమి దాదాపు 50 సార్లు కంపించింది. వీటి తీవ్రత రిక్టర్ స్కేలుపై 5కి లోపే నమోదైంది.
కాగా, ఈ భూకంపం ప్రభావం భారత్ లోని ఉత్తరాది రాష్ట్రాల్లోనూ కనిపించింది. దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాలు, బీహార్, బెంగాల్ రాష్ట్రాల్లో స్వల్ప ప్రకంపనలు వచ్చాయి.
అటు, టిబెట్ లో భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల తొలగింపు కొనసాగేకొద్దీ, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.