KTR: కేటీఆర్ విదేశాలకు పారిపోయే అవకాశముంది!: కాంగ్రెస్ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు
- కేటీఆర్ పాస్‌పోర్ట్‌ను సీజ్ చేయాలని డిమాండ్
- కేటీఆర్ నిజంగానే తప్పు చేయకుంటే లీగల్ టీమ్ ఎందుకని ప్రశ్న
- కేటీఆర్ ప్రజల సొమ్మును కాజేసిన దొంగ అని ఆగ్రహం
కేటీఆర్ విదేశాలకు పారిపోయే అవకాశముందని, కాబట్టి ఆయన పాస్‌పోర్ట్‌ను సీజ్ చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. మంగళవారం నాడు గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కేటీఆర్ ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో విచారణను ఎదుర్కొంటున్నారని, ఆయన పాస్‌పోర్ట్‌ను సీజ్ చేయాలన్నారు.
కేటీఆర్ నిజంగానే ఎలాంటి తప్పు చేయకపోతే న్యాయ నిపుణులు, లీగల్ టీమ్ ఎందుకని ప్రశ్నించారు. ఎలాంటి తప్పు చేయలేదని కేటీఆర్ చెబుతున్నారని, మరి విచారణకు ఎందుకు హాజరు కావడం లేదో చెప్పాలన్నారు. వారు దోచుకున్న సొమ్మును ప్రజలకు పంచి పెట్టేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందన్నారు.
దొంగలకు అండగా ఉంటారా? లేక ప్రజల కోసం పని చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వైపు ఉంటారా? అనేదానిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆలోచించాలన్నారు. కేటీఆర్ ప్రజల సొమ్మును కాజేశాడని ఆరోపించారు. ప్రజల సొమ్ము కాజేసిన దొంగ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తి లేదన్నారు.