Chandrababu: గన్నవరం ఎయిర్ పోర్టును కూచిపూడి థీమ్ తో ఆధునికీకరణ: సీఎం చంద్రబాబు

Chandrababu said Gannavaram Airport is being modernized with a Kuchipudi theme

  • కుప్పంలో చంద్రబాబు పర్యటన
  • రెండో రోజు పలు కార్యక్రమాలకు హాజరు
  • పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

నన్ను గుండెల్లో పెట్టుకుని ఇంతవాణ్ణి చేసిన కుప్పం ప్రజల రుణం తీర్చుకునేందుకే స్వర్ణ కుప్పం విజన్ -2029 డాక్యుమెంట్ రూపొందించానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.. పేదరిక నిర్మూలన, పరిశ్రమలు, ఉద్యోగ కల్పన, నైపుణ్య శిక్షణా కేంద్రాలు, అందరికీ విద్య వంటి 10 అంశాలకు విజన్ డాక్యుమెంటులో ప్రాధాన్యత ఇచ్చాం’ అని వివరించారు. కుప్పం రెండో రోజు పర్యటనలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడారు. 

కుప్పంలో కార్గో ఎయిర్ పోర్టు రాబోతోంది

కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి సమర్థవంతంగా పనిచేస్తున్న 'కడా' అధికారులను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. కుప్పాన్ని టూరిజం హబ్ గా మారుస్తా. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. అందులో భాగంగా గన్నవరం ఎయిర్ పోర్టును కూచిపూడి నృత్యం థీమ్‌తో ఆధునీకరిస్తున్నాము. కుప్పం ప్రజలు కాలుష్యానికి దూరంగా ఆరోగ్యంగా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నాను. కుప్పంలో కార్గో ఎయిర్ పోర్టు రాబోతోంది. ఇక్కడి ప్రజలకు అత్యాధునిక వైద్యాన్ని అందించేందుకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి తీసుకొస్తున్నాము. టాటా సంస్థ సహకారంతో మెరుగైన వైద్య సేవలు అందిస్తాం.

కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.92 కోట్లు

మరో మూడు నెలల్లో కుప్పానికి వస్తాను. కడా ఆధ్వర్యంలో కుప్పంలో చేపట్టే అభివృద్ధి పనులను నేను స్వయంగా పర్యవేక్షిస్తాను. కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.92.22 కోట్లు మంజూరు చేశాము. అందులో రూ. 22 కోట్ల వ్యయంతో ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి చేస్తాము. గత ఐదేళ్లు ఈ ప్రాంగణాన్ని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చారు. 

రూ.20 కోట్ల వ్యయంతో కుప్పంలో డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటుచేస్తాం. రూ.10 కోట్ల వ్యయంతో కుప్పంలో 10 జంక్షన్లు ఏర్పాటు చేయడంతో పాటు ప్రధాన రహదారులను సుందరీకరిస్తాము. విద్యుత్ దీపాల ఏర్పాటుకు రూ.3 కోట్లు మంజూరు చేశాం. రూ.19 కోట్ల వ్యయంతో పార్కులను అభివృద్ధి చేయబోతున్నాము. 

కుప్పం నియజకవర్గంలో గుంతల రోడ్లు కనపడకూడదు. రహదారుల అభివృద్ధి, మరమ్మతుల కోసం రూ. 34.27 కోట్లు మంజూరు చేశాం. శాంతిపురం పరిధిలో మదర్ డెయిరీకి 41 ఎకరాల 21 సెంట్లు ఇచ్చాము. రూ. 105 కోట్ల వ్యయంతో రాబోతున్న ఈ డెయిరీ వల్ల 4 వేలమందికి ఉద్యోగాలు వస్తాయి. అలాగే శ్రీజ మహిళా మిల్క్ సంస్థ ఏర్పాటుతో మరో 4 వేల ఉద్యోగాలు రాబోతున్నాయి.  

కుప్పం పరిధిలో రూ.22 కోట్ల వ్యయంతో ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేశాం. డ్వాక్రా ఏర్పాటు చేసి మహిళల ఆర్థిక స్వావలంబనకు బాటలు వేశాను. ఇప్పుడు కుప్పం నియోజకవర్గంలో అలీప్ సంస్థ సహకారంతో మహిళలకు పలు ఉత్పత్తుల తయారీలో శిక్షణ ఇవ్వడం ద్వారా వారి ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తాం... అని చంద్రబాబు వివరించారు.   

  • Loading...

More Telugu News