Satya Nadella: సత్య నాదెళ్ల కీలక ప్రకటన: భారత్‌లో మైక్రోసాఫ్ట్‌ భారీ పెట్టుబడులు

Microsoft to Make Major Investments in India Satya Nadella

  • భారత్ లో పర్యటిస్తున్న సత్య నాదెళ్ల
  • బెంగళూరులో కీలక ప్రకటన
  • 2030 నాటికి 10 మిలియన్ల మందికి ఏఐ స్కిల్స్‌పై శిక్షణే లక్ష్యం

మైక్రోసాఫ్ట్‌ సంస్థ భారత్‌లో 3 బిలియన్‌ డాలర్ల భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ ఛైర్మన్‌, సీఈఓ సత్య నాదెళ్ల ప్రకటించారు. క్లౌడ్‌ సేవలు, కృత్రిమ మేధ (ఏఐ) సామర్థ్యాలు, డేటా సెంటర్ల విస్తరణ వంటి రంగాల్లో ఈ పెట్టుబడిని వినియోగించనున్నట్లు ఆయన తెలిపారు. 2030 నాటికి 10 మిలియన్ల మందికి ఏఐ స్కిల్స్‌పై శిక్షణ అందించడమే ఈ పెట్టుబడితో సంస్థ ముందుకు తీసుకెళ్లే మరో ముఖ్య లక్ష్యంగా ఆయన వెల్లడించారు.

సత్య నాదెళ్ల మంగళవారం నాడు బెంగళూరులో నిర్వహించిన కార్యక్రమంలో ఈ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం భారత్‌ పర్యటనలో ఉన్న ఆయన, సోమవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏఐ రంగంలో భారత్‌ను ప్రపంచవ్యాప్తంగా ఉన్నత స్థానంలో నిలిపేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను నిలపాలన్న ప్రధాని మోదీ లక్ష్యాన్ని సాకారం చేసేందుకు మైక్రోసాఫ్ట్‌ తమ స్థాయిలో తోడ్పాటును అందిస్తుందని నాదెళ్ల స్పష్టం చేశారు.

భారత నైపుణ్యాలపై తన ప్రత్యేక అభిప్రాయాలను వ్యక్తం చేసిన సత్య నాదెళ్ల, భారతీయ నిపుణులు కొత్త నైపుణ్యాలను అభ్యసించడంలో ప్రథమ స్థానంలో ఉన్నారని కొనియాడారు. లింక్డిన్‌ గణాంకాల ప్రకారం, ఏఐ స్కిల్స్‌ను తమ ప్రొఫైల్‌లో జోడించుకున్న వారి సంఖ్య గ్లోబల్‌గా 71 శాతం పెరిగినప్పటికీ, భారత్‌లో ఈ వృద్ధి 122 శాతం ఉందని నాదెళ్ల పేర్కొన్నారు. 

2025 నాటికి 2 మిలియన్ల మందిని ఏఐ నిపుణులుగా తీర్చిదిద్దాలన్న ‘అడ్వాంటేజ్‌ ఇండియా’ కార్యక్రమ లక్ష్యాన్ని మైక్రోసాఫ్ట్‌ ముందుగానే పూర్తి చేయగలిగిందని తెలిపారు. ఇప్పుడు 2030 నాటికి 10 మిలియన్ల మందికి శిక్షణ ఇవ్వడం తదుపరి లక్ష్యమని ప్రకటించారు.

భారత్‌లో 3 బిలియన్‌ డాలర్ల భారీ పెట్టుబడులు పెట్టడం సంస్థకు గర్వకారణమని, ఈ పెట్టుబడి దేశంలో ఏఐ ఆవిష్కరణలకు మరింత ఊతం కల్పిస్తుందని సత్య నాదెళ్ల చెప్పారు. ఇది భారత్‌లో టెక్నాలజీ రంగ అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News