AR Rahman: ఏఆర్ రెహ్మాన్ జీవితాన్ని మార్చేసిన 'చిన్ని చిన్ని ఆశ' ట్యూన్
- కీబోర్డు ప్లేయర్‌గా మణిరత్నంకు తారసపడిన రెహ్మాన్
- మణిరత్నంను ఇంప్రెస్ చేసిన 'చిన్ని చిన్ని ఆశ' పాట ట్యూన్
- మణిరత్నం ఇచ్చిన అవకాశాలతో ప్రముఖ సంగీత దర్శకుడిగా ఎదిగిన రెహ్మాన్
సినీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ జీవితాన్ని 'చిన్ని చిన్ని ఆశ' ట్యూన్ మార్చేసి ఆస్కార్ అవార్డు దరికి చేర్చింది. 1992లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'రోజా' సినిమాతో ఏఆర్ రెహ్మాన్ ప్రముఖ సినీ సంగీత దర్శకుడుగా మారారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే, ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా అవకాశం ఎలా వచ్చింది అనే విషయాల్లోకి వెళితే ..
సినీరంగంలోకి రాకముందు రెహ్మాన్ కీబోర్డు ప్లేయర్‌గా పని చేసేవాడు. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా పలు వేడుకల్లో ఏర్పాటు చేసే మ్యూజికల్ ఈవెంట్స్ లో పాల్గొనేవాడు. ఈ క్రమంలోనే ఒకసారి రెహ్మాన్ ముంబైలో జరిగిన ఒక వేడుకలో పాల్గొని కీబోర్డు ప్లే చేశాడు. ఈ వేడుకకు అప్పటికే ప్రముఖ సినీ దర్శక నిర్మాతగా ఫామ్‌లో ఉన్న మణిరత్నం హజరయ్యారు. రెహ్మాన్ కీబోర్డు వాయిద్యాన్ని చూసి మణిరత్నం ఇంప్రెస్ అయ్యారు.
దీంతో వేడుక అనంతరం మణిరత్నంకు రెహ్మాన్ ఎదురుపడటంతో తన విజిటింగ్ కార్డు ఇచ్చిన మణిరత్నం ఒకసారి వచ్చి కలవమని రెహ్మాన్‌కు సూచించారు. అప్పటికే మణిరత్నం అభిమాని అయిన రెహ్మన్ ఆనందంతో సరేనని చెప్పి ఆ మరుసటి రోజే మణిరత్నం వద్దకు వెళ్లి కలిశారు. రెహ్మాన్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్న మణిరత్నం .. మంచి ట్యూన్ ఏదైనా చేసి తీసుకుని రా చూద్దాం అని చెప్పారు. దాంతో అదే రోజు రాత్రి మళ్లీ మణిరత్నంను కలిసి ట్యూన్ చేశానంటూ ఓ ఆడియో క్యాసెట్‌ను రెహ్మాన్ అందించాడు.
దీంతో మణిరత్నం ఆశ్చర్యానికి గురయ్యారట. అప్పటికే బయటకు వెళ్లేందుకు సిద్దమైన మణిరత్నం కారులోనే ట్యూన్ విని రెహ్మాన్ ప్రతిభను గుర్తించి ప్రశంసించి అవకాశాలు కల్పించారు. మణిరత్నంను ఇంప్రెస్ చేసిన 'చిన్ని చిన్న ఆశ' పాటతో రెహ్మాన్ దశ తిరిగింది. మణిరత్నం ఇచ్చిన అవకాశాలతో తన ప్రతిభతో రెహ్మన్ ఆస్కార్ అవార్డు స్థాయికి ఎదిగారు.