hidden camera: అయోధ్య ఆలయంలోకి సీక్రెట్ కెమెరాతో వచ్చిన వ్యక్తి అరెస్ట్
- అయోధ్య ఆలయంలో భద్రతా నియమాలు ఉల్లంఘించిన భక్తుడు
- సీక్రెట్ కెమెరాతో ఆలయంలో ప్రవేశించిన భక్తుడిని అడ్డుకున్న అధికారులు
- గుజరాత్ లోని వడోదరకు చెందిన భక్తుడి నిర్వాకం
ఆలయ నిబంధనలు అతిక్రమించి సీక్రెట్ కెమెరాతో ఆలయంలో ప్రవేశించడమే కాక ఫోటోలు తీసిన ఓ వ్యక్తిని అయోధ్య పోలీసులు అరెస్టు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా అయోధ్య రామ మందిరంలో ఫోటోలు, వీడియోలు తీయడం నిషేధం.
ఆలయం లోపలకి వెళ్లే భక్తులు తమ సెల్ ఫోన్‌లను టికెట్ కౌంటర్ వద్ద ఏర్పాటు చేసిన కేంద్రంలో భద్రపరుచుకోవాల్సి ఉంటుంది. అయితే ఓ వ్యక్తి రహస్య కెమెరాతో ఆలయంలోకి ప్రవేశించాడు. తన హైటెక్ సన్‌గ్లాసెస్‌కు రహస్యంగా కెమెరాను అమర్చుకుని అనుమానం రాకుండా ఆలయం లోపలకు వెళ్లాడు. కొన్ని ప్రాంతాల్లోని చెకింగ్ పాయింట్ల వద్ద కూడా దాన్ని గుర్తించకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు.
అయితే లోపలకు వెళ్లిన తర్వాత అతను ఫోటోలు తీస్తుండగా, కళ్ల అద్దాల చివరలో వెలుగు రావడం కనిపించడంతో అధికారులకు అనుమానం వచ్చి పరిశీలించగా, అందులో సీక్రెట్ కెమెరా ఉండటాన్ని గమనించి అదుపులోకి తీసుకున్నారు. అతడిని గుజరాత్ లోని వడోదరకు చెందిన వ్యాపారవేత్త జానీ జైకుమార్‌గా గుర్తించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.