Dan Christian: అందుబాటులో లేని రిజర్వు ఆటగాళ్లు.. బ్యాటింగ్‌కు దిగి సిక్సర్లు బాదిన అసిస్టెంట్ కోచ్.. వీడియో ఇదిగో!
- బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్స్-బ్రిస్బేన్ హీట్ మధ్య మ్యాచ్‌లో ఘటన
- సిడ్నీ జట్టుకు అందుబాటులో లేకుండా పోయిన రిజర్వు ఆటగాళ్లు
- గతేడాది ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన డేన్ క్రిస్టియన్
- రెండు సిక్సర్లతో 15 బంతుల్లో 23 పరుగులు చేసిన డేన్
ఓ లీగ్ మ్యాచ్‌లో రిజర్వు ఆటగాళ్లు లేకపోవడంతో అసిస్టెంట్ కోచ్ ప్యాడ్లు కట్టుకోవాల్సి వచ్చింది. నమ్మశక్యం కాని ఈ ఘటన బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్స్- బ్రిస్బేన్ హీట్ మధ్య మ్యాచ్‌లో జరిగింది. బ్యాటింగ్‌కు దిగిన అసిస్టెంట్ కోచ్‌ను చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. బాన్‌క్రాఫ్ట్, డానియెల్ శామ్స్ వంటి ఆటగాళ్లు ఫీల్డింగ్ చేస్తూ గాయపడటం, ఫిట్నెస్ సమస్యల కారణంగా రిజర్వు ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో 41 ఏళ్ల అసిస్టెంట్ కోచ్ డేన్ క్రిస్టియన్ బ్యాట్ పట్టి బరిలోకి దిగాడు.
గతేడాదే ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన క్రిస్టియన్ ఈ మ్యాచ్‌లో బ్యాట్‌తో మెరుపులు మెరిపించాడు. 15 బంతుల్లో 23 పరుగులు చేశాడు. ఇందులో రెండు సిక్సర్లు కూడా ఉన్నాయి. క్రిస్టియన్ కొట్టిన ఓ భారీ సిక్సర్ 92 మీటర్ల దూరం దూసుకెళ్లి మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఫలితంగా సిడ్నీ థండర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది.
అనంతరం 174 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బ్రిస్బేన్ హీట్ 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. మ్యాక్స్ బ్రయంట్ 35 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 72 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాట్ రెన్షా 48 పరుగులు చేయగా, కెప్టెన్ కోలిన్ మున్రో 23 పరుగులు చేశాడు.