Hair growth: శిరోజాలు ఒత్తుగా పెరిగేందుకు తోడ్పడే గింజలు ఇవే!

five powerful seeds that promote healthy hair growth

  • మారిన జీవన శైలి, కాలుష్యంతో చాలా మందిలో ఊడిపోతున్న జుట్టు 
  • నల్లగా, ఒత్తుగా జుట్టు పెంచుకోవాలని కోరుకునేవారు ఎందరో...
  • అలాంటి వారికి ఈ ఐదు రకాల గింజలతో ప్రయోజనం ఉంటుందంటున్న నిపుణులు

ఇంటా, బయటా పొల్యూషన్, ఉప్పు నీళ్లు, మారిన జీవన శైలి వంటివాటితో చాలా మందిలో చిన్న వయసులోనే శిరోజాలు తెల్లబడిపోతున్నాయి. వెంట్రుకలు రాలిపోయి, బట్టతల వచ్చేస్తున్నవారు ఎందరో. చాలా మంది నల్లగా నిగనిగలాడే ఒత్తయిన జుట్టు ఉండాలని కోరుకుంటారు. అలాంటి వారికి ఐదు రకాల గింజలతో ప్రయోజనం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఫ్లాక్స్ సీడ్స్...
ఈ గింజల్లో ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్లు పెద్ద మొత్తంలో ఉంటాయి. ఇవి మన వెంట్రుకల కుదుళ్లకు తగిన పోషణ అందిస్తాయి. వెంట్రుకలు బాగా పెరిగేందుకు తోడ్పడుతాయి. అలాగే ఫ్లాక్స్ సీడ్స్ లోని లిగ్నాన్స్, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఇన్ ఫ్లమేషన్ ను తగ్గిస్తాయి. హార్మోన్లు సమతుల్యంగా ఉండేందుకు దోహదపడుతాయి. ఈ రెండు చర్యలతోనూ మన వెంట్రుకల కుదుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. తరచూ ఆహారంలో ఫ్లాక్స్ సీడ్స్ ను చేర్చుకోవడం వల్ల వాటి ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

గుమ్మడి గింజలు...
మనం పెద్దగా పట్టించుకోని గుమ్మడి గింజలు అద్భుతమైన పోషక పదార్థాలకు నిలయమని నిపుణులు చెబుతున్నారు. వాటిలో అధికంగా ఉండే జింక్.. దెబ్బతిన్న జుట్టును మరమ్మతు చేయడానికి సహకరిస్తుందని వివరిస్తున్నారు. ఇక గుమ్మడి గింజల్లోని మెగ్నీషియం, ఐరన్ వంటివి వెంట్రుకలు బలంగా పెరగడానికి దోహదం చేస్తాయని స్పష్టం చేస్తున్నారు.

చియా సీడ్స్...
మన జుట్టు బలంగా పెరగడానికి దోహదపడే ఆహారంలో చియా సీడ్స్ కూడా ఒకటి. వీటిలోనూ ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్లు, ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. ఇవి మన వెంట్రుకల కుదుళ్లకు తగిన పోషణను ఇచ్చి.. రాలిపోకుండా ఉండేందుకు తోడ్పడుతాయని నిపుణులు చెబుతున్నారు.

నల్ల నువ్వులు...
మన జుట్టు సంరక్షణకు సంబంధించిన ఉత్పత్తుల్లో నల్ల నువ్వులను పురాతన కాలం నుంచీ ఉపయోగిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. వీటిలోని కొన్ని రకాల రసాయన సమ్మేళనాలు వెంట్రుకలు తెల్లబడటాన్ని, రాలిపోవడాన్ని నియంత్రిస్తాయని వివరిస్తున్నారు. తరచూ నల్ల నువ్వులను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల... వెంట్రుకలు కుదుళ్ల నుంచీ బలంగా పెరుగుతాయని, నల్లగా నిగనిగలాడుతాయని పేర్కొంటున్నారు.

పొద్దు తిరుగుడు గింజలు...
వీటిలో విటమిన్ ఈ ఎక్కువ మోతాదులో ఉంటుంది. మన వెంట్రుకలు బలంగా, ఒత్తుగా, నల్లగా నిగనిగలాడేందుకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది. వెంట్రుకలు రాలిపోకుండా, తెల్లబడకుండా చూస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేగాకుండా వీటిలోని ఫ్యాటీ యాసిడ్లు, ప్రొటీన్లు మన పూర్తి ఆరోగ్యానికి తోడ్పడుతాయని వివరిస్తున్నారు.

ఈ అంశాలను గుర్తుంచుకోండి
పైన చెప్పిన ఐదు రకాల గింజలతో కేవలం వెంట్రుకలకే కాదు... మొత్తంగా మన శరీర ఆరోగ్యానికి కావాల్సిన అద్భుత పోషకాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, మధుమేహం, హైబీపీ, గుండె జబ్బులతో బాధపడుతున్నవారు... ఆహారంలో మార్పులు చేసుకునే ముందు వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఎంతో అద్భుతమైన పోషకాలే అయినా... కొందరిలో కొన్నిసార్లు ఆరోగ్యానికి ఇబ్బందిగా మారే అవకాశం కూడా ఉంటుందని గుర్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News