AP High Court: వైఎస్ జగన్‌కు హైకోర్టులో ఊరట .. పాస్‌పోర్టు పునరుద్దరణకు ఆదేశాలు
- వైఎస్ జగన్ యూకే పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏపీ హైకోర్టు
- పాస్ పోర్టు కోసం ఎన్వోసీ జారీ చేసిన హైకోర్టు
- ఐదేళ్ల కాలపరిమితితో పాస్ పోర్టు ఇవ్వాలని అథారిటీకి ఆదేశం
పాస్‌పోర్టు మంజూరు అంశంలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. పాస్‌పోర్టు పొందేందుకు జగన్‌కు తాజాగా హైకోర్టు నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) జారీ చేసింది. ఐదేళ్ల కాలపరిమితితో జగన్‌కు తాజా పాస్‌పోర్టు జారీ చేయాలని అథారిటీని హైకోర్టు ఆదేశించింది. అలాగే యూకేలో ఈ నెల 16న జరగనున్న తన కుమార్తె డిగ్రీ పట్టా ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరయ్యేందుకు జగన్‌కు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి ఆదేశాలు ఇచ్చారు.
పాస్‌పోర్టు పొందేందుకు ఎన్వోసీ జారీ చేయాలంటూ తొలుత వైఎస్ జగన్ విజయవాడ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ఎన్వోసీ ఇవ్వాలంటే స్వయంగా కోర్టుకు హజరై 20 వేలతో వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాల్సిందేనని పేర్కొంది. దీంతో ప్రత్యేక కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక కోర్టు ఆదేశాలను రద్దు చేస్తూ తీర్పునిచ్చారు.