Vishal: హీరో విశాల్ ఆరోగ్యంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన సినీ నటి ఖుష్బూ

Khushbu gives clarity on actor vishal health

  • 'మదగదరాజ' సినిమా ఈవెంట్ లో వణుకుతూ కనిపించిన విశాల్
  • విశాల్ కు ఏమైందంటూ అభిమానుల ఆందోళన
  • 103 డిగ్రీల జ్వరంతో విశాల్ వణికిపోయాడన్న ఖుష్బూ

తమిళ స్టార్ హీరో విశాల్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 'మదగదరాజ' సినిమా ఈవెంట్ లో ఆయన వణుకుతూ కనిపించారు. దీంతో, ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆయన జ్వరంతో బాధపడుతున్నారని టీమ్ చెప్పినప్పటికీ... ఆయన ఆరోగ్యం గురించి అభిమానులు వాకబు చేస్తూనే ఉన్నారు. 

ఈ క్రమంలో విశాల్ ఆరోగ్యం గురించి సీనియర్ నటి ఖుష్బూ క్లారిటీ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ... విశాల్ ఢిల్లీలో ఉన్నప్పుడే ఆయనకు జ్వరం వచ్చిందని తెలిపారు. 'మదగదరాజ' సినిమా 11 ఏళ్ల తర్వాత రిలీజ్ అవుతోందని... అందుకే అనారోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా ఈవెంట్ కు వచ్చారని వెల్లడించారు. 

103 డిగ్రీల జ్వరంతో విశాల్ వణికిపోయాడని ఖుష్బూ తెలిపారు. ఇంత జ్వరంతో ఎందుకు వచ్చావని తాను అడిగితే... 11 ఏళ్ల తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోందని, అందుకే కచ్చితంగా రావాలనుకున్నానని చెప్పాడని వెల్లడించారు. ఈవెంట్ పూర్తికాగానే విశాల్ ను ఆసుపత్రికి తీసుకెళ్లామని... ఆయన ఇప్పుడు కోలుకుంటున్నాడని తెలిపారు. ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ సినిమా కోసం విశాల్ ఎంతో కష్టపడ్డాడని కితాబునిచ్చారు. 

విశాల్, తాను కలిసి పని చేయలేదని... కానీ ఇద్దరం ఎంతో ఆత్మీయంగా ఉంటామని ఖుష్బూ తెలిపారు. తొలిసారి తామిద్దరం ఒక పార్టీలో కలిశామని... ఆ తర్వాత ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడిందని చెప్పారు. విశాల్ చాలా టాలెంటెడ్ ఆర్టిస్ట్ అని... ఆయన నటించిన కొన్ని సినిమాలు తనకు ఎంతో ఇష్టమని అన్నారు. మిగతా హీరోలను తాను 'మీరు' అని సంబోధిస్తానని... కానీ విశాల్ తో మాత్రం సరదాగా మాట్లాడతానని చెప్పారు. 

విశాల్ హీరోగా, వరలక్ష్మి శరత్ కుమార్, అంజలి హీరోయిన్లుగా 'మదగదరాజ' సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు ఖుష్బూ భర్త సుందర్ దర్శకత్వం వహించారు. 11 ఏళ్ల తర్వాత ఈ నెల 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 

  • Loading...

More Telugu News