UP Women: 'యూపీలో బిచ్చగాడితో పారిపోయిన మహిళ' కేసులో ట్విస్ట్

No UP Woman Did Not Elope With Beggar UP Police Clariffication

  • భర్త వేధింపులు తట్టుకోలేక బంధువుల ఇంటికి వెళ్లిన భార్య
  • బిచ్చగాడితో పారిపోయిందంటూ పోలీసులకు భర్త ఫిర్యాదు
  • భార్యను వెతికి పట్టుకుని విచారించడంతో బయటపడ్డ నిజం

భర్తను, ఆరుగురు పిల్లలను వదిలేసి ఓ మహిళ బిచ్చగాడితో పారిపోయిందంటూ జరుగుతున్న ప్రచారంలో అసలు నిజాలు బయటపడ్డాయి. ఇంట్లోని డబ్బు, నగలతో భార్య కనిపించకుండా పోవడం, ఎప్పుడూ వీధిలోనే ఉండే బిచ్చగాడు కూడా కనిపించకుండా పోవడంతో భర్త వారిద్దరూ కలిసి వెళ్లిపోయారని భర్త అనుమానించాడని పోలీసులు చెబుతున్నారు. భర్త ఫిర్యాదుతో గాలింపు చర్యలు చేపట్టి సదరు భార్య ఆచూకీ గుర్తించారు. ఆమెను విచారించడంతో భర్త వేధింపులు భరించలేక బంధువుల ఇంటికి వచ్చానని చెప్పింది. ఉత్తరప్రదేశ్ లోని హర్దోయి జిల్లా హర్పాల్ పూర్ లో చోటుచేసుకుందీ ఘటన.

హర్పాల్ పూర్ కు చెందిన రాజేశ్వరి, రాజు దంపతులకు ఆరుగురు పిల్లలు.. ఈ నెల 3న కూరగాయలు తీసుకువస్తానని చెప్పి వెళ్లిన రాజేశ్వరి తిరిగి రాలేదు. మార్కెట్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికిన రాజు.. చివరకు పోలీసులను ఆశ్రయించాడు. తన భార్య కనిపించకుండా పోయిందని, ఇంట్లో నగదు, నగలు కూడా పోయాయని చెప్పాడు. ఎప్పుడూ తమ వీధిలోనే తచ్చాడే బిచ్చగాడితో తన భార్య మాట్లాడుతూ ఉండేదని, ఫోన్ లో ఛాటింగ్ కూడా చేసుకునే వారని వివరించాడు. ఇప్పుడు ఆ బిచ్చగాడు కూడా అదృశ్యమయ్యాడని, బహుశా వారిద్దరూ కలిసి పారిపోయి ఉంటారని ఫిర్యాదు చేశాడు.

ఈ కేసు వివరాలను స్థానిక మీడియా ప్రసారం చేయడంతో జిల్లాలో సంచలనంగా మారింది. భర్తను, ఆరుగురు పిల్లలను వదిలేసి బిచ్చగాడితో వెళ్లిన మహిళ అంటూ దినపత్రికలు వార్తా కథనాలు ప్రచురించాయి. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు రాజేశ్వరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు మంగళవారం సాయంత్రం బంధువుల ఇంట్లో ఉన్న రాజేశ్వరిని గుర్తించి స్టేషన్ కు తీసుకువచ్చి విచారించారు. తన భర్త రాజు నిత్యం వేధిస్తున్నాడని, తిడుతూ కొడుతుండడంతో భరించలేక ఇంట్లో నుంచి వచ్చేశానని రాజేశ్వరి వెల్లడించింది. భర్త తనపై ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ఫిర్యాదు చేశాడని, బిచ్చగాడితో పారిపోయాననడం అబద్ధమని తెలిపింది.

  • Loading...

More Telugu News