HYDRA: ‘బతుకమ్మ కుంట’పై హైకోర్టులో విజయం.. సంబరాలు చేసుకున్న హైడ్రా ఉద్యోగులు
- బతుకమ్మ కుంటను కుంటగానే గుర్తించిన హైకోర్టు
- పిటిషనర్ ఎడ్ల సుధాకర్‌రెడ్డి పిటిషన్‌ను కొట్టేసిన న్యాయస్థానం
- విజయంలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగులు
- కార్యాలయంలో సన్మానించిన కమిషనర్ రంగనాథ్
- బతుకమ్మ కుంట పునరుద్ధరణకు చర్యలు ప్రారంభం
చెరువులు, కుంటల ఆక్రమణలపై కొరడా ఝళిపిస్తున్న హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ (హైడ్రా)కు హైకోర్టులో విజయం లభించింది. అంబర్‌పేటలోని బతుకమ్మ కుంటను కుంటగానే గుర్తిస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. ‘అగ్రిమెంట్ ఆఫ్ సేల్’ ఆధారంగా ఆ స్థలం తమదేనంటూ ఎడ్ల సుధాకర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది.
బతుకమ్మ కుంటను పునరుద్ధరించాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు హైడ్రాకు సంబంధిత పత్రాలు అందజేయడంతో ఆ సంస్థ కమిషనర్ రంగనాథ్ నవంబర్ 13న కుంటను సందర్శించి పునరుద్ధరణకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో సుధాకర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో తాజాగా ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. బతకుమ్మ కుంట భూమిపై సుధాకర్‌రెడ్డికి ఎలాంటి హక్కులు లేవని స్పష్టం చేసింది. అది బతకమ్మ కుంట స్థలమేనని తేల్చి చెప్పింది.
కోర్టు తీర్పుపై రంగనాథ్ హర్షం వ్యక్తం చేశారు. అవసరమైన పత్రాలను కోర్టుకు సమర్పించి విజయానికి కారణమైన ఉద్యోగులను ఈ సందర్భంగా హైడ్రా కార్యాలయంలో ఆయన సన్మానించారు. బతుకమ్మ కుంటకు పూర్వ వైభవం తీసుకొస్తామని చెబుతూ, ప్రస్తుతం అక్కడ నివసిస్తున్న వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చెరువు తవ్వకానికి ఆదేశాలు జారీచేశారు.