international police: 'భారత్ పోల్' పోర్టల్‌ను ప్రారంభించిన అమిత్ షా .. విదేశాలకు పారిపోయే నేరస్తులకు బిగ్ షాక్
- విదేశాలకు పరారైన నేరస్తులను తిరిగి తీసుకువచ్చేందుకు 'భారత్‌పోల్' విభాగం దోహదపడుతుందన్న అమిత్ షా
- అంతర్జాతీయ స్థాయి కేసుల దర్యాప్తు వేగవంతం కోసం 'భారత్‌పోల్'
- ఇకపై రాష్ట్రాల పోలీసులు కూడా ఇంటర్‌పోల్‌ను నేరుగా సంప్రదించవచ్చన్న అమిత్ షా
దేశంలో పెద్ద ఎత్తున ఆర్ధిక నేరాలకు పాల్పడి, ఇక్కడి దర్యాప్తు సంస్థలకు చిక్కకుండా ఇతర దేశాలకు పరారై అక్కడ ఎంజాయ్ చేస్తున్న వారి ఆటలు కట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో భాగంగా భారత్‌పోల్ పోర్టల్‌ను ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ పోర్టల్‌ను మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు.
విదేశాలకు చెక్కేసిన నేరస్తులను దర్యాప్తు సంస్థలు భారత్ తిరిగి తీసుకువచ్చేందుకు 'భారత్‌పోల్' విభాగం దోహదపడుతుందన్నారు. అంతర్జాతీయ స్థాయి కేసుల దర్యాప్తును వేగవంతం చేసేందుకు 'భారత్‌పోల్' ను తీసుకొచ్చామని అమిత్ షా తెలిపారు. ఇప్పటి వరకు ఇంటర్‌పోల్‌తో భారత్ తరపున సీబీఐ మాత్రమే సమన్వయం చేసుకునేదని, ఇకపై భారత్‌పోల్ పోర్టల్ ద్వారా దేశానికి చెందిన ప్రతి దర్యాప్తు సంస్థ, అన్ని రాష్ట్రాల పోలీసులు నేరుగా ఇంటర్‌పోల్‌ను సంప్రదించవచ్చని తెలిపారు. ఇందుకు గానూ మూడు నేర చట్టాలపై రాష్ట్రాలకు శిక్షణ ఇచ్చే బాధ్యతను సీబీఐ తీసుకుంటుందని అమిత్ షా వెల్లడించారు.
ఇకపై లెటర్లు, ఈమెయిల్స్, ఫ్యాక్సులు వంటి పాత తరహా కమ్యూనికేషన్ వ్యవస్థ స్థానాన్ని భారత్‌పోల్ పోర్టల్ భర్తీ చేస్తుంది. డిజిటల్ మాధ్యమంలో వేగంగా సమాచార బదిలీ జరుగుతుంది. సీబీఐ, ఇంటర్‌పోల్ మధ్య కమ్యూనికేషన్ గతం కంటే మెరుగవుతుంది.