Canada: కెనడా ప్రధాని రేసులో ముందున్న భారత సంతతి మహిళ.. ఎవరీ అనితా ఆనంద్?
- ప్రస్తుతం రవాణా శాఖ మంత్రిగా సేవలందిస్తున్న అనిత
- ట్రూడో రాజీనామా చేయడంతో ప్రధాని రేసులోకి..
- లిబరల్ పార్టీలో కీలక నేతగా అనితకు గుర్తింపు
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రాజీనామా చేయడంతో కొత్త ప్రధాని ఎంపిక కోసం లిబరల్ పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. ప్రధాని బాధ్యతలు చేపట్టేందుకు పలువురు నేతలు సిద్ధంగా ఉన్నారని, వారిలో ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కెనడా తదుపరి ప్రధానిగా భారత సంతతికి చెందిన అనితా ఆనంద్ ను ఎంపిక చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
లిబరల్ పార్టీలో సీనియర్ నేతగా, ప్రస్తుతం కెనడా రవాణా శాఖతో పాటు అంతర్గత వాణిజ్యం శాఖల మంత్రిగా అనిత సేవలందిస్తున్నారు. ప్రధాని రేసులో పలువురి పేర్లు వినిపిస్తున్నప్పటికీ అనితా ఆనంద్ ముందంజలో ఉన్నట్లు సమాచారం.
వైద్యులైన అనిత తల్లిదండ్రులు సరోజ్ డి రామ్, ఎస్ వీ ఆనంద్ 1960 లలో భారతదేశం నుంచి కెనడాకు వెళ్లి స్థిరపడ్డారు. 1967 మే 20 కెంట్ విల్లేలో అనిత జన్మించారు. అనితకు ఇద్దరు చెల్లెల్లు గీత, సోనియా.. పొలిటికల్ సైన్స్ లో డిగ్రీ పూర్తిచేసిన అనిత, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ అందుకున్నారు. డల్హౌసీ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ, టొరంటో యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారు.
కెరీర్ తొలినాళ్లలో తాను చదువుకున్న టొరంటో యూనివర్సిటీలోనే లా ప్రొఫెసర్ గా పనిచేశారు. తర్వాత అసోసియేట్ డీన్ గా, రాట్ మన్ స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్ లో డైరెక్టర్ గా సేవలందించారు. 1995లో వ్యాపారవేత్త జాన్ నావిటన్ ను అనిత వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అనిత.. ఓక్ విల్లే నుంచి హౌస్ ఆఫ్ కామన్స్ కు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం కెనడా రవాణా శాఖ మంత్రిగా సేవలందిస్తున్నారు.