Hardik Pandya: ఛాంపియన్స్ ట్రోఫీకి హార్దిక్ పాండ్యాను ఎంపిక చేస్తారా?.. తెరపైకి సస్పెన్స్
- మరో రెండు రోజుల్లో జట్టుని ప్రకటించనున్న బీసీసీఐ సెలక్టర్లు
- 2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత ఒక్క వన్డే కూడా ఆడని పాండ్యా
- గాయం కారణంగా సుదీర్ఘ విరామం తీసుకున్న స్టార్ ఆల్‌రౌండర్
- ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి పాండ్యా ఎంపికపై మొదలైన ఉత్కంఠ
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి సమయం ఆసన్నమవుతోంది. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా ఈ మెగా టోర్నీ షురూ కానుంది. జనవరి 12 లోగా జట్లు తమ ఆటగాళ్ల జాబితాను ఐసీసీకి సమర్పించాల్సి ఉంటుంది. టీమిండియా ఆటగాళ్లను బీసీసీఐ జనవరి 10న ప్రకటించనుందని సమాచారం. ఐసీసీ డెడ్‌లైన్‌కు రెండు రోజుల ముందుగానే ఆటగాళ్ల ఎంపిక ఉండొచ్చని తెలుస్తోంది. దీనిపై అజిత్ అగార్కర్ సారధ్యంలోని సెలక్షన్ కమిటీ ఇప్పటికే ఆటగాళ్ల ఎంపికపై సమాలోచనలు చేస్తోంది.
అయితే, జట్టు ఎంపికలో పెద్దగా ఆశ్చర్యం కలిగించే పేర్లు ఏవీ ఉండకపోవచ్చని ‘స్పోర్ట్స్‌స్టార్’ పేర్కొంది. గతేడాది జులైలో చివరిసారిగా భారత జట్టు శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడింది. కాబట్టి, ఆటగాళ్ల ఎంపిక విషయంలో సర్‌ప్రైజింగ్ నిర్ణయాలు ఉండవని విశ్లేషించింది. మరోవైపు, టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాను జట్టులోకి తీసుకుంటారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే, 2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత పాండ్యా ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఆడలేదు. గాయం కారణంగా సుదీర్ఘ విరామం తీసుకున్నాడు. ఆ తర్వాత కోలుకొని టీ20 వరల్డ్ కప్-2024కు ఎంపికై రాణించినప్పటికీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయడంపై సెలక్టర్లు ఒకటికి రెండు సార్లు ఆలోచించే అవకాశాలు ఉన్నాయి.
విజయ్ హజారే ట్రోఫీలో ఆడి సత్తా నిరూపించుకోవాల్సి ఉంటుందని పాండ్యాకు ఇదివరకే బీసీసీఐ పెద్దలు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో, బరోడా తరపున లీగ్ దశలో ఆడిన పాండ్యా... నాకౌట్ దశలో కూడా ఆడనున్నట్టు తెలుస్తోంది. అయితే, జట్టు ఎంపికకు ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉండడంతో సెలక్టర్లు ఏం చేయనున్నారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు, ఛాంపియన్స్ ట్రోఫీలో దిగ్గజ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయనున్నట్టు సమాచారం. యువ క్రికెటర్లు యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ పేర్లను కూడా సెలక్టర్లు పరిగణనలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.