Elon Musk: ఎలాన్ మస్క్ పై ఆయన తండ్రి సంచలన వ్యాఖ్యలు

Elon Musks Father Errol Urges People To Ignore His Son

  • ఎలాన్ చేప్పేవన్నీ పట్టించుకోవద్దన్న ఎర్రల్ మస్క్
  • బిలియనీర్ కాబట్టే ఎలాన్ ట్వీట్లను చాలామంది రీట్వీట్ చేస్తారని వ్యాఖ్య
  • తండ్రీకొడుకుల మధ్య తీవ్ర విభేదాలు

ప్రపంచ కుబేరులలో ఒకరైన ఎలాన్ మస్క్ పై ఆయన తండ్రి ఎర్రల్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కొడుకు చెప్పే మాటలు పట్టించుకోవద్దని అన్నారు. ఎలాన్ ఓ బిలియనీర్ కాబట్టి అతడు చేసే ట్వీట్లను చాలామంది రీట్వీట్ చేస్తారని చెప్పారు. అలాగని ఎలాన్ చేసిన ట్వీట్లను, వ్యాఖ్యలను అన్నింటినీ పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. తన ఉద్దేశంలో ఎలాన్ ఓ సాధారణ వ్యక్తి మాత్రమేనని, బాగా డబ్బు ఉంది కాబట్టి అతడు చెప్పేవన్నీ నమ్మాలని ఏమీ లేదని చెప్పారు. ‘ఎలాన్ ట్వీట్ చేశాడనో, ఆ ట్వీట్ ను చాలామంది రీట్వీట్ చేస్తున్నారనో చింతించకుండా సింపుల్ గా అతడిని బయటకు పొమ్మనాలి’ అంటూ ఎర్రల్ మస్క్ వ్యాఖ్యానించారు.

ఇక, తండ్రీకొడుకులు ఎర్రల్, ఎలాన్ మస్క్ ల మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయని గతంలోనే వెల్లడైంది. ఎలాన్ మస్క్ జీవిత చరిత్రపై పుస్తకంలో రచయిత ఐజాక్సన్ ఈ విషయం ప్రస్తావించారు. ఎలాన్‌ మస్క్‌ ఇతర దేశాల రాజకీయాల్లో జోక్యం చేసుకోవడంపై ఇటీవల విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను మద్దతిచ్చిన అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలుపొందిన తర్వాత ఎలాన్ మస్క్ కు విపరీతమైన ప్రాధాన్యం లభిస్తోంది. ఆ తర్వాత ఎలాన్ మస్క్ దేశ, విదేశాల రాజకీయ వ్యవహారాలలో ఎక్కువగా తలదూరుస్తున్నారు. వివిధ అంశాలపై ఎలాన్ చేస్తున్న ట్వీట్లు వైరల్ గా మారుతున్నాయి. చాలామంది ఆయన ట్వీట్లను రీట్వీట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎలాన్ తండ్రి ఎర్రల్ స్పందించారు. తన కొడుకు మాటలు పట్టించుకోవద్దంటూ ఎర్రల్ తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News