Jasprit Bumra: ఛాంపియన్స్‌ట్రోఫీకి జస్ప్రీత్ బుమ్రా దూరం?

If Jasprit Bumras back spasm turns out to be a Grade 1 he could be out of Champions Trophy 2025

  • ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్టులో వెన్నునొప్పి బారినపడ్డ బుమ్రా
  • ఆట మధ్యలోనే మైదానాన్ని వీడి హాస్పిటల్‌కు వెళ్లిన స్టార్ పేసర్
  • వెన్నునొప్పి కాస్త గ్రేడ్-1 తీవ్రత కలిగిన ఫ్రాక్చర్‌గా మారితే ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమవుతాడంటూ కథనాలు

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో చివరిదైన సిడ్నీ టెస్టులో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయపడిన విషయం తెలిసిందే. వెన్నునొప్పితో ఆట మధ్యలోనే మైదానాన్ని వీడాడు. దీంతో, ఫిబ్రవరి 19 నుంచి మొదలుకానున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో అతడు పాల్గొనడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టీమ్ మేనేజ్‌మెంట్ ప్రకటించినట్టుగా అది వెన్నునొప్పి అయితే పర్వాలేదు. బుమ్రా కచ్చితంగా అందుబాటులోకి వస్తాడు. ఒకవేళ అది కాస్త గ్రేడ్-1 తీవ్రత కలిగిన ఫ్రాక్చర్ అయితే మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉండబోడని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పేర్కొంది.

ఇదే విషయమై సెలక్టర్లు కూడా ఆందోళన చెందుతున్నారని తెలిపింది. వెన్నునొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటే కొంతకాలం జట్టుకి అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. మెడికల్ పరీక్షలో వచ్చే ఫలితం ఆధారంగా సెలక్టర్ల నిర్ణయం ఉండనుంది. బుమ్రా ఇంతకుముందు ఒకసారి వెన్నునొప్పి ఫ్రాక్చర్‌తో బాధపడడం ఈ ఆందోళనలకు ప్రధాన కారణమవుతోంది. అందుకే, వెన్నునొప్పిని గుర్తించిన తొలి దశలోనే ఆటకు విరామం ఇవ్వాలని, లేదంటే తీవ్రత ఇంకా ఎక్కువవుతుందంటూ టీమిండియా మాజీ క్రికెటర్ ఒకరు చెప్పినట్టుగా ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పేర్కొంది.

కాగా, జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పి మెడికల్ రిపోర్ట్ సర్జన్‌ పరిశీలన కోసం పంపించారు. అతి త్వరలో అప్‌డేట్ వచ్చే అవకాశం ఉంది. సమస్య తీవ్రత పెద్దగా లేదని గుర్తిస్తే ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసే ఆటగాళ్ల మొదటి ప్రాబబుల్స్ జాబితాలోనే అతడి పేరు ఉంటుంది. మరోవైపు, బుమ్రాను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయంటూ కథనాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అద్భుతంగా వ్యక్తిగత ప్రదర్శన చేయడంతో పాటు రెండు మ్యాచ్‌లకు కెప్టెన్‌గానూ వ్యవహరించి రాణించడంతో బుమ్రాను ఎంపిక చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయని సెలక్టర్లు యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News