Nara Lokesh: మన 'నమో' ప్రధాని అనే మాటకు అర్థం మార్చారు: విశాఖ సభలో నారా లోకేశ్
విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ సభలో ఏపీ మంత్రి నారా లోకేశ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్ ఆసక్తికర ప్రసంగం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని నమో పేరిట వేనోళ్ల కొనియాడారు.
"సిటీ ఆఫ్ డెస్టినీకి వచ్చిన నరేంద్ర మోదీకి హృదయపూర్వకం స్వాగతం పలుకుతున్నాం. ప్రతి భారతీయుడి హృదయంలో నమో ఉన్నారు. ఇవాళ ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోందంటే అందుకు కారణం నమో. ఆయన ప్రధాని అనే పదానికి అర్థం మార్చారు. గతంలో ప్రధానులుగా ఉన్నవారు కేవలం ప్రధానిగానే ఉంటే... నేడు మన నమో ప్రజలమనిషిగా మారారు.
నమో విజన్ ఎప్పుడూ ప్రపంచస్థాయిలో ఉంటుంది... కానీ ఆయన హృదయం మాత్రం భారత్ తోనే ఉంటుంది. నమో అంటే పేదల విశ్వాసం... పేదల చిరునవ్వు నమో... యువత భవిత నమో... మహిళల ఆత్మగౌరవం నమో. 2047 నాటికి భారత్ ను అభివృద్ధి చెందని దేశంగా మార్చేందుకు నమో కృషి చేస్తున్నారు.
విజన్ ఉన్నవారు దునియా అంతా చూస్తారు. చంద్రబాబు విజన్ 2020 అంటే కొందరు ఎగతాళి చేసి వెటకారంగా మాట్లాడారు. ఇవాళ హైదరాబాద్ వెళ్లి చూస్తే ఆయన విజన్ లో చెప్పిన ప్రతి మాట నిజమైంది. ఇప్పుడు స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ప్రకటించారు. ఇక, గత ప్రభుత్వ నిర్వాకంతో వెంటిలేటర్ పై ఉన్న ఏపీకి ప్రధాని మోదీ ఆక్సిజన్ అందించారు.
ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేందుకు మన సీబీఎన్ అహర్నిశలు కృషి చేస్తున్నారు. రూ.1000 పెన్షన్ పెంచేందుకు గత ప్రభుత్వానికి ఐదేళ్లు పట్టింది... కానీ మన సీబీఎన్ ఒకే ఒక్క సంతకంతో పెన్షన్ రూ.1000 పెంచారు. మూసేసిన అన్న క్యాంటీన్లు తెరిపించారు... దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నారు. త్వరలోనే మెగా డీఎస్సీ రాబోతోంది... దటీజ్ సీబీఎన్.
ఇవాళ చరిత్రలో నిలిచిపోయే రోజు. రాష్ట్ర దశ, దిశ మార్చే రూ.2 లక్షల కోట్ల విలువ చేసే ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేయబోతున్నారు. ఉత్తరాంధ్ర కల అయిన విశాఖ రైల్వే జోన్, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్, పూడిమడకలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, అనేక రోడ్ల ప్రాజెక్టులు, రైల్వే ప్రాజెక్టులు ప్రారంభించబోతున్నారు.
అభివృద్ధి జరగాలంటే ప్రభుత్వ కొనసాగింపు చాలా ముఖ్యం. మోదీ మూడోసారి ప్రధాని అయ్యారు. 2014 నుంచి 19 వరకు జరిగిన అభివృద్ధిని మీరంతా చూశారు. అదే 2019 నుంచి జరిగిన విధ్వంసాన్ని కూడా అందరూ చూశారు. మరోసారి మోదీకి ఏపీ ప్రజల తరఫున బేషరతుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.
నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్... ఇలా ఎక్కడికి వెళ్లినా ఒకటే మేనియా... అదే నమో మేనియా... అందరికీ నమస్కారం... జైహింద్" అంటూ నారా లోకేశ్ తన ప్రసంగం ముగించారు.