Revanth Reddy: త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి: రేవంత్ రెడ్డి
- కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో రేవంత్ రెడ్డి
- నేతలు, కార్యకర్తలు పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపు
- 26 నుంచి రైతు భరోసా ఇస్తున్నట్లు వెల్లడి
స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో ఉంటాయని, కాంగ్రెస్ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నిన్న సాయంత్రం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో నిర్వహించిన కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకు వెళ్లాలన్నారు. మన పథకాలను ఇంటింటికి చెప్పాలని సూచించారు.
అధికారంలోకి వచ్చిన కొన్నిరోజుల్లోనే 55 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, రూ.21 వేల కోట్ల రుణాలను రైతులకు మాఫీ చేశామని, మహాలక్ష్మి పథకం కింద రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని, పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని, ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని సీఎం అన్నారు.
జనవరి 26 నుంచి రైతు భరోసా ఇవ్వనున్నట్లు చెప్పారు. అర్హులకు త్వరలో కొత్త రేషన్ కార్డులను అందిస్తామన్నారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. ప్రతిపక్షాలు చేసే విమర్శలకు గట్టిగా సమాధానం చెప్పాలని నేతలకు సూచించారు.
మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ ఏర్పాటైందని రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన మృతికి సంతాపం తెలిపామని, భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశామని గుర్తు చేశారు. పాతబస్తీలో ప్రారంభించిన ప్లైఓవర్‌కు మన్మోహన్ సింగ్ పేరును పెట్టామన్నారు.