Bald: వారం రోజుల్లో 50 మందికి బట్టతల.. బాధితుల గగ్గోలు!
- మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఘటన
- వరుసగా బట్టతల బాధితులుగా మారుతున్న ప్రజలు
- ఆయా గ్రామాలను సందర్శించిన వైద్యాధికారులు
- నీరు, జుట్టు, స్కిన్ శాంపిల్స్ సేకరణ
మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలోని పలు గ్రామాల్లో వారం రోజుల వ్యవధిలో 50 మంది బట్టతల బాధితులుగా మారారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఏం జరుగుతోందో అర్థం కాక ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా జిల్లాలోని బోర్గావ్, కల్వాడ్, హింగ్నా గ్రామాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది.
ఈ గ్రామాల్లో రోజురోజుకు బట్టతల బాధితులు పెరుగుతుండటంతో వైద్యాధికారులు స్పందించారు. ఆయా గ్రామాల్లో పర్యటించారు. బాధితులతో మాట్లాడారు. వారి నుంచి జుట్టు, స్కిన్, కలుషిత నీరు శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపారు. ఎరువుల కారణంగా నీరు కలుషితం అవుతోందని, జుట్టు రాలిపోవడానికి ఇదే కారణమని ప్రాథమికంగా గుర్తించారు. పరీక్షల నివేదిక వచ్చిన అనంతరం అసలు కారణం తెలుస్తుందని చెప్పారు.