Russia: రష్యాలో 25 ఏళ్ల లోపు యువతులు పిల్లల్ని కంటే రూ. 81 వేల ప్రోత్సాహకం!
- ప్రకటించిన రష్యా ప్రభుత్వం
- రష్యాలో గణనీయంగా పడిపోతున్న జననాల రేటు
- ఆరోగ్యకరమైన పిల్లల్ని కన్న వారికి ప్రోత్సాహకాలు
- రష్యాకు చెందిన వారై, ఏదైనా కాలేజీలో చదువుతున్న వారే అర్హులు
జననాల రేటు దేశంలో గణనీయంగా పడిపోతున్న నేపథ్యంలో రష్యా ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఆరోగ్యకరమైన పిల్లలకు జన్మనిచ్చే 25 ఏళ్లలోపు విద్యార్థినులకు లక్ష రూబుళ్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 81 వేలు) ప్రోత్సాహకం ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఏదైనా స్థానిక యూనివర్సిటీ, కాలేజీల్లో ఫుల్‌టైమ్‌గా చదువుతున్న 25 ఏళ్ల యువతులే ఈ పథకానికి అర్హులు. అంతేకాదు, వారు కరేలియా(రష్యా)కు చెందిన వారై ఉండాలి.
ఆరోగ్యకరమైన బిడ్డలకు జన్మనిచ్చిన వారికే ఈ నగదు బహుమతి లభిస్తుంది. చనిపోయిన బిడ్డకు జన్మనిచ్చే తల్లులకు ఇది వర్తించదు. అయితే, పుట్టిన శిశువు అకస్మాత్తుగా చనిపోతే ప్రోత్సాహకం సంగతేంటన్న విషయంలో స్పష్టత లేదు. వైకల్యంతో జన్మిస్తే పరిస్థితి ఏంటన్న విషయంలోనూ క్లారిటీ లేదు. ఇలాంటి వారికి అదనంగా ఏదైనా బోనస్ ఇస్తారా? లేదా? వారిని ఎలా ఆదుకుంటారన్న విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
2024లో రష్యాలో జననాల రేటు దారుణంగా పడిపోయింది. నిరుడు కేవలం 5,99,600 మంది పిల్లలు మాత్రమే జన్మించారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 16 వేల మంది తక్కువగా జన్మించారు. గత 25 ఏళ్లతో పోలిస్తే జననాల రేటు ఇదే అత్యల్పం. ఈ నేపథ్యంలో ‘ఇది దేశ భవిష్యత్తుకు పెను విపత్తు’ అని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి పెస్కోవ్ అభివర్ణించారు. ఈ నేపథ్యంలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.