Pritish Nandy: బాలీవుడ్ నిర్మాత, జర్నలిస్ట్ ప్రీతిష్ నంది మృతి
- గుండెపోటుతో మృతి చెందిన ప్రీతిష్ నంది
- ఆయన వయసు 73 సంవత్సరాలు
- ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన ప్రీతిష్
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, రచయిత ప్రీతిష్ నంది ఈరోజు కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. దక్షిణ ముంబైలోని తన ఇంటిలో ఆయన గుండెపోటులో తుదిశ్వాస విడిచారు.
ప్రీతిష్ నంది మృతి చెందిన విషయాన్ని ఆయన స్నేహితుడు, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన ప్రియమైన మిత్రుడు ప్రీతిష్ నంది మరణ వార్తను తెలుసుకొని తీవ్ర ఆవేదనకు గురయ్యానని అనుపమ్ ఖేర్ అన్నారు. ప్రీతిష్ నంది ఒక అద్భుతమైన కవి, రచయిత, ఫిలిం మేకర్, జర్నలిస్ట్ అని కొనియాడారు.
మరోవైపు జర్నలిస్టుగా కెరీర్ ను ప్రారంభించిన ప్రీతిష్ రచయితగా, నిర్మాతగా గుర్తింపు సంపాదించుకున్నారు. గతంలో 1998 నుంచి 2004 వరకు రాజ్యసభ సభ్యుడిగా కూడా వ్యవహరించారు. పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన ప్రీతిష్ నంది... వెబ్ సిరీస్ లను కూడా నిర్మించారు. సాహిత్య రంగంలో ఆయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ప్రీతిష్ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు.