Champions Trophy 2025: పాకిస్థాన్ ‘ఛాంపియన్స్ ట్రోఫీ’ స్టేడియాల్లో కనీసం ప్లాస్టింగ్ పనులు కూడా పూర్తికాని వైనం.. వీడియో ఇదిగో

In one of the stadiums that host Champions trophy even plaster work is not completed

  • మూడు స్టేడియాల్లో ఇంకా పూర్తికాని పనులు
  • వాతావరణం ప్రతికూలంగా మారిందంటున్న ఐసీసీ వర్గాలు
  • వచ్చే వారం పనులపై క్లారిటీ వచ్చే అవకాశం
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

సరిగ్గా మరో 40 రోజుల్లో, అంటే ఫిబ్రవరి 19 నుంచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ప్రారంభం కానుంది. హైబ్రీడ్ మోడల్‌లో పాకిస్థాన్, దుబాయ్‌ వేదికలుగా ఈ మెగా టోర్నమెంట్ జరగనుంది. అయితే, పాక్‌లో జరిగే మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్న స్టేడియాల జాబితాలో ఉన్న లాహోర్, కరాచీ, రావల్పిండి మైదానాలు ఇంకా సిద్దం కాలేదు. ఒక స్టేడియంలోనైతే కనీసం ప్లాస్టింగ్ పనులు కూడా పూర్తికాలేదు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వాల్సిన మైదానాలు ఇంకా సిద్ధం కాకపోవడం నిరుత్సాహం కలిగిస్తోందని ఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. ‘‘మూడు స్టేడియాలు సిద్ధం కాలేదు. సరైన రీతిలో స్టేడియాల నిర్మాణానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. సీట్లు, ఫ్లడ్‌లైట్లు, సౌకర్యాలు, అవుట్‌ఫీల్డ్‌లకు సంబంధించిన పనులు చాలా మిగిలి ఉన్నాయి’’ అంటూ ఐసీసీ వర్గాలు చెప్పాయని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పేర్కొంది.

‘‘వేగంగా పనులు పూర్తి చేయడానికి వాతావరణం అనుకూలంగా లేదు. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో ప్లాస్టింగ్ పనులు కూడా ఇంకా పూర్తి కాలేదు. ఫినిషింగ్ వర్క్స్‌కే ఎక్కువ సమయం పడుతోంది. డ్రెస్సింగ్ రూమ్‌లు, ఎన్‌క్లోజర్లు అన్ని పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఐసీసీ టోర్నమెంట్లకు చెక్ లిస్ట్ ప్రకారం నిర్దేశిత గడువు లోగా పనులన్నీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆతిథ్య దేశాలు చాలా ముందుగానే స్టేడియాలను ఐసీసీకి అప్పగించాల్సి ఉంటుంది. తగిన సౌకర్యాలు కల్పించారా? లేదా? అనే క్వాలిటీ చెక్ చేయాలని నిబంధనలు చెబుతున్నాయి. వచ్చే వారంలో ఈ పనులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పీసీబీ, ఐసీసీ కలిసి అద్భుతం చేస్తాయేమో చూడాలి’’ అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

నిర్దేశిత గడువులోగా ఏర్పాట్లు పూర్తికాకపోతే టోర్నమెంట్‌ను తరలించాల్సి ఉంటుందంటూ కథనాలు కూడా వెలువడుతున్నాయి.

  • Loading...

More Telugu News