Chinta Mohan: ఆ భక్తులు షుగర్ లెవల్స్ పడిపోయి చనిపోయారు... వాళ్లను ఎవరూ నెట్టలేదు: చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు
- తిరుపతిలో శ్రీవారి భక్తుల తోపులాట
- పలువురు భక్తుల మృతి
- ఇందులో టీటీడీ వైఫల్యం లేదన్న చింతా మోహన్
- భక్తులు తిండిలేకుండానే క్యూలైన్లలోకి వచ్చి సొమ్మసిల్లి పడిపోయారని వెల్లడి
తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ జారీ కేంద్రాల వద్ద జరిగిన ఘటనల్లో భక్తులు మృతి చెందడం పట్ల తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో టీటీడీ వైఫల్యం లేదని అన్నారు. టీటీడీ అధికారులు ఈ మధ్య బాగా పనిచేస్తున్నారని, గతంలో కంటే ఇప్పుడు చాలా బెటర్ అని వ్యాఖ్యానించారు.
"వాస్తవ విషయం చాలామందికి తెలియదు. భక్తులు అంతకుముందు రోజు రాత్రంతా ప్రయాణాలు చేసి ఆత్రుతతో వచ్చి క్యూలో నిలబడ్డారు. వాళ్లు సరిగా అన్నం కూడా తినలేదు... టిఫిన్లు కూడా చేయలేదు. దాంతో వాళ్ల బ్లడ్ షుగర్ లెవల్స్ పడిపోయాయి.
ఆ విధంగా షుగర్ లెవల్స్ తగ్గిపోవడంతో కిందపడిపోయిన భక్తుల పక్కనే కొందరు స్థానికులు ఉన్నారు. వాళ్లు కళ్లతో చూసి చెప్పారు... ఎవరూ ఆ భక్తులను నెట్టలేదు... వాళ్లకై వాళ్లే పడిపోయారు... ఇది వాస్తవం. దీనికి శ్యామలరావు (టీటీడీ ఈవో) గానీ, వెంకయ్యచౌదరి (అదనపు ఈవో) గానీ, ఇతర అధికారులకు గానీ, పోలీసులకు గానీ సంబంధం లేదు" అని చింతా మోహన్ వ్యాఖ్యానించారు.