Gautam Gambhir: హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్‌పై మనోజ్ తివారీ సంచలన ఆరోపణలు

Manoj Tiwary criticism on Team India head coach Gautam Gambhir
  • గంభీర్ ఒక మోసగాడన్న కోల్‌కతా నైట్ రైడర్స్ మాజీ ఆటగాడు
  • ఇతరులకు చెప్పే నీతులు అతడు మాత్రం పాటించడంటూ విమర్శలు గుప్పించిన మనోజ్ తివారీ
  • కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాళ్లు నితీశ్ రాణా, హర్షిత్ రాణాలకు ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారంటూ ప్రశ్న
  • గంభీర్ గతంలో తన కుటుంబాన్ని దుర్భాషలాడాడంటూ మండిపాటు
  • సౌరవ్ గంగూలీ గురించి కూడా చెడుగా మాట్లాడాడన్న మనోజ్ తివారీ
భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ మాజీ బ్యాటర్ మనోజ్ తివారీ సంచలన ఆరోపణలు గుప్పించాడు. గంభీర్ ఒక మోసగాడు అని, ఇతరులకు అతడు చెప్పే నీతులు ఆచరణలో చూపించడని విమర్శించాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ ఆటగాళ్లు నితీశ్ రాణా, హర్షిత్ రాణాలకు ఎందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారంటూ గంభీర్‌ను ప్రశ్నించాడు. ఆస్ట్రేలియాలో సిరీస్‌లో మొదటిదైన పెర్త్ టెస్టులో రాణించిన ఆకాశ్ దీప్‌ను తదుపరి టెస్టుల్లో పక్కన పెట్టి హర్షిత్ రాణాను జట్టులోకి తీసుకోవడం మనోజ్ తివారీ ప్రశ్నించాడు.

‘‘ ఈ మార్పు ఎలా సాధ్యమైంది?. ఆకాశ్ దీప్ ఏం తప్పు చేశాడు?. స్వదేశంలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్ సిరీస్‌లలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. పిచ్ కండీషన్లు అర్థం చేసుకొని బౌలింగ్ చేయగలిగే బౌలర్ కావాలని మీరే (గంభీర్) చెబుతుంటారు. కానీ, అలాంటి సామర్థ్యం ఉన్న ఆకాశ్ దీప్‌ను పక్కనపెట్టి  హర్షిత్‌ రాణాను జట్టులోకి తీసుకున్నారు. ఆకాశ్ దీప్‌కు అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. అందుకే ఆటగాళ్లు అతడిని సమర్థిస్తుంటారు’’ అని పేర్కొన్నారు.

తానేమీ తప్పుగా అనడం లేదని, వాస్తవాలు మాత్రమే మాట్లాడుతున్నానని మనోజ్ తివారీ పేర్కొన్నాడు. గతంలో గంభీర్ తన కుటుంబాన్ని దుర్భాషలాడాడని, టీమిండియా క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీని గురించి కూడా చెడుగా మాట్లాడాడని ఆరోపించాడు. ఢిల్లీలో రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో గంభీర్‌తో తాను గొడవ పడినప్పుడు అందరూ అతడు చెప్పిన మాటలే విన్నారని వాపోయాడు. గంభీర్ ఏం మాట్లాడిన పీఆర్ (పబ్లిక్ రిలేషన్స్) టీమ్ గొప్పగా ప్రచారం చేస్తుందని, దాని గురించే తాను మాట్లాడుతున్నానని వివరించాడు. పీఆర్ టీమ్ గురించి తాను మాట్లాడుతున్నానని అన్నాడు.

కాగా, మనోజ్ తివారీ, గంభీర్ ఇద్దరూ ఐపీఎల్‌తో పాటు ఢిల్లీ దేశవాళి జట్టుకు కూడా కలిసి ఆడారు. ఆస్ట్రేలియా పర్యటనలో, అంతకుముందు స్వదేశంలో న్యూజిలాండ్ సిరీస్‌లోనూ టీమిండియా ఘోర ఓటమి పాలైన నేపథ్యంలో గంభీర్‌పై విమర్శలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మనోజ్ తివారీ విమర్శలకు దిగడం గమనార్హం.
Gautam Gambhir
Manoj Tiwary
Cricket
Sports News

More Telugu News