Suresh: 5 లక్షలు తీసుకునే నాకు, ఆ నిర్మాత 5 వేలు ఇచ్చాడు: హీరో సురేశ్

Suresh Interview
  • ఒకప్పుడు లవర్ బాయ్ అనిపించుకున్న సురేశ్ 
  • ఆ సినిమాతో తండ్రి నష్టపోయాడని వ్యాఖ్య 
  • తాను అప్పులు తీర్చవలసి వచ్చిందని వివరణ  
  • తమిళంలో అందుకే బ్రేక్ వచ్చిందని వెల్లడి 
  • రామానాయుడు ఛాన్స్ ఇచ్చారంటూ ఎమోషనల్

సురేశ్ .. లవర్ బాయ్ గా తమిళంలో ఒక వెలుగు వెలిగిన నటుడు. ఆ తరువాత హీరోగా తెలుగులోను అనేక సినిమాలలో నటించారు. తాజాగా 'ఐ డ్రీమ్' వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన కెరియర్ ను గురించిన అనేక విషయాలను ప్రస్తావించారు. "మా ఫాదర్ దర్శక నిర్మాత .. 'రాముడు - పరశురాముడు' సినిమాతో వచ్చిన నష్టం కారణంగా ఆయన కోలుకోలేదు. ఆయన అనారోగ్య కారణాల వలన నేను ఆ అప్పులు తీర్చవలసి వచ్చింది" అని అన్నారు. 

"తమిళంలో నేను హీరోగా బిజీ అయ్యాను. అప్పులు తీరడం వలన, ఇక లవ్ స్టోరీస్ కాకుండా కొత్త కథలను ట్రై చేయాలనే ఒక ఆలోచన వచ్చింది. అప్పటివరకూ నాతో చేసిన నిర్మాతలు, లవ్ స్టోరీస్ అయితేనే చేస్తామని తేల్చిచెప్పారు. అందువలన 11 సినిమాలను వదులుకున్నాను. నేను లవ్ స్టోరీస్ చేయననే టాక్ బయటికి పోవడం వలన, 7.. 8 నెలల పాటు ఖాళీగా ఉన్నాను. అలాంటి పరిస్థితులలో రామానాయుడిగారిని కలిసి నా పరిస్థితిని గురించి చెప్పాను" అని అన్నారు. 

" రామనాయుడిగారు 'పుట్టింటి పట్టుచీర'తో నాకు అవకాశం ఇచ్చారు. అదే సమయంలో 'చిన్న కోడలు' .. 'మామాశ్రీ' చేశాను. ఆ సినిమాలు చాలా తక్కువ గ్యాప్ లో రిలీజ్ కావడం .. అవన్నీ హిట్ కావడం వలన నాకు కలిసొచ్చింది. అయితే ఈ మూడు సినిమాలకి ముందు నేను తెలుగులో ఒక సినిమా చేశాను. అప్పటికి తమిళంలో నేను ఒక సినిమాకి 5 లక్షలు తీసుకుంటున్నాను. కానీ తెలుగులో ఆ సినిమా నిర్మాత నాకు పారితోషికంగా 5 వేలు మాత్రమే ఇస్తున్నట్టు చెప్పారు. అది షూటింగు మొదటి రోజు. అందువలన నేను ఏమీ అనలేని పరిస్థితి. ఆ డబ్బు కూడా ఆయన సినిమా రిలీజ్ అయిన మూడు నాలుగు నెలలకు ఇచ్చాడు" అని చెప్పారు.

Suresh
Actor
Ramanayudu

More Telugu News