Tech-News: ఫోన్​ లో సిగ్నల్ సరిగా​ లేదా? ఇకపై నచ్చిన నెట్​ వర్క్​ వాడొచ్చు!

jio airtel bsnl users can now use other available network to make calls
  • పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని టెలికం కంపెనీల సిగ్నల్ సరిగా ఉండని తీరు
  • మనం వాడే నెట్ వర్క్ ఒకటైతే... మరో నెట్ వర్క్ బాగుండే పరిస్థితి
  • సిగ్నల్ సరిగా లేకుంటే అప్పటికప్పుడు మరో నెట్ వర్క్ ను వాడుకునే అవకాశం
మారుమూల ప్రాంతాలు అనే కాదు... పట్టణాల్లోనూ కొన్ని చోట్ల కొన్ని టెలికం కంపెనీల సిగ్నల్స్ సరిగా ఉండవు. ఒక చోట జియో సిగ్నల్ బలంగా వస్తే.. మరో చోట ఎయిర్ టెల్, ఇంకో చోట బీఎస్ఎన్ఎల్ సిగ్నల్ బాగుంటాయి... దాంతో, మిగతా కంపెనీల నెట్ వర్క్ వాడేవారికి ఇంటర్నెట్ స్లోగా వస్తుంటుంది. తద్వారా, ఫోన్ కాల్స్ లో అంతరాయం ఏర్పడుతూ ఉంటుంది. ఇకపై ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేలా కేంద్ర ప్రభుత్వం కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర టెలికం శాఖ తాజాగా దీనిపై ప్రకటన జారీ చేసింది.

ఇంట్రా సర్కిల్ రోమింగ్ (ఐసీఆర్) విధానంలో...
సాధారణంగా విదేశాలకు వెళ్లేవారు... మన దేశంలోని ఫోన్ నంబర్ తోనే విదేశాల్లో కాల్స్ చేసుకోవడానికి, ఇంటర్నెట్ వాడుకోవడానికి ‘రోమింగ్’ సదుపాయం ఉంటుంది. దీనికి విడిగా భారీ స్థాయిలో చార్జీలు ఉంటాయి. ఇదే తరహాలో దేశంలోనూ అంతర్గతంగా ‘ఇంట్రా సర్కిల్ రోమింగ్ (ఐసీఆర్)’ విధానాన్ని టెలికం శాఖ ప్రారంభించింది. దీనిద్వారా జియో, ఎయిర్ టెల్, బీఎస్ఎన్ఎల్... ఇలా ఏ నెట్ వర్క్ వాడేవారైనా ఇతర నెట్ వర్క్ ల ద్వారా సిగ్నల్ అందుకుని, 4జీ సర్వీసులను వాడుకోవచ్చు.

డీబీఎన్ టవర్ల పరిధిలో...
ప్రస్తుతం ఇంట్రా సర్కిల్ రోమింగ్ సదుపాయం ‘డీబీఎన్ టవర్ల’ పరిధిలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. డీబీఎన్ అంటే ‘డిజిటల్ భారత్ నిధి’. దేశంలో టెలికమ్యూనికేషన్ సర్వీసులు అందరికీ సమర్థవంతంగా, నాణ్యమైన రీతిలో అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ డీబీఎన్ ను ప్రారంభించింది.

ప్రస్తుతం ఈ మూడు నెట్ వర్క్ ల పరిధిలోనే...
దేశంలో ప్రస్తుతం ఇంట్రా సర్కిల్ రోమింగ్ సదుపాయం జియో, ఎయిర్ టెల్, బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ ల మధ్య మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఈ మూడు కంపెనీలు ఒకరి వ్యవస్థలను మరొకరు వినియోగించుకోవడానికి ముందుకు వచ్చాయని కేంద్ర టెలికం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. భవిష్యత్తులో మిగతా కంపెనీలు కూడా జతకూడే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 27,836 డీబీఎన్ టవర్లు ఉన్నట్టు వివరించారు. దేశవ్యాప్తంగా ఎక్కడా సిగ్నల్ సమస్య లేదని విధంగా వీటిని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
Tech-News
Mobile
Jio
Airtel
Bsnl
offbeat
Viral News
internet
4g

More Telugu News