Chandrababu: మా ఏఐ వర్సిటీ సలహామండలిలో భాగస్వామ్యం కండి: బిల్ గేట్స్ ను కోరిన నారా లోకేశ్

Chandrababu and Lokesh held meeting with Bill Gates in Davos
  • దావోస్ లో నేడు కీలక సమావేశం
  • మైక్రో సాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తో చంద్రబాబు, లోకేశ్ భేటీ
  • ఏపీలో ఐటీ అభివృద్ధికి సహకరించాలని బిల్ గేట్స్ కు విజ్ఞప్తి
మైక్రో సాఫ్ట్ అధినేత, ప్రపంచ ఐటీ దిగ్గజం బిల్ గేట్స్ తో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ దావోస్ ప్రొమెనేడ్ మైక్రోసాఫ్ట్ కేఫ్ లో భేటీ అయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తమపై నమ్మకంతో మైక్రోసాఫ్ట్ ఐటీ కేంద్రాన్ని నెలకొల్పడంతో హైదరాబాద్ రూపురేఖలు మారిపోయిన విషయాన్ని బిల్ గేట్స్ కు చంద్రబాబు గుర్తుచేశారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఏపీలో ఐటీ అభివృద్ధికి సహాయ, సహకారాలను అందించాలని మంత్రి నారా లోకేశ్ కోరారు. 

"ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయబోతున్న వరల్డ్ క్లాస్ ఏఐ యూనివర్సిటీ సలహామండలిలో భాగస్వామ్యం వహించండి. మీ అమూల్యమైన సలహాలు మా రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి దోహదం చేస్తాయి. ఏపీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్ అండ్ డయాగ్నోస్టిక్స్‌ను ఏర్పాటు చేయడానికి బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ తరపున ఏపీ ప్రభుత్వంతో భాగస్వామ్యం వహించండి. రాష్ట్రంలోని ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ ఎకో సిస్టమ్‌ను నడపడానికి ఆఫ్రికాలో హెల్త్ డ్యాష్‌బోర్డ్‌ల తరహాలో సామాజిక వ్యవస్థాపకతలో ఫౌండేషన్ తరపున నైపుణ్య సహకారాన్ని అందించండి. దక్షిణ భారతంలో బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ కార్యకలాపాలకు ఏపీని గేట్‌వేగా నిలపండి. మీ సహకారంతో స్థానికంగా ఉత్పత్తులపై ప్రపంచ ఆవిష్కరణలను అమలు చేసేలా ఏపీ ప్రభుత్వం పనిచేస్తుంది" అని మంత్రి లోకేశ్ విజ్ఞప్తి చేశారు. 

చాలా రోజుల తర్వాత చంద్రబాబును కలవడం ఆనందదాయకం: బిల్ గేట్స్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును దావోస్ లో కలవడం పట్ల బిల్ గేట్స్ స్పందించారు. విజనరీ లీడర్ చంద్రబాబును చాలాకాలం తర్వాత కలవడం ఆనందంగా ఉందని అన్నారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బిల్ గేట్స్ చెప్పారు.
Chandrababu
Bill Gates
Nara Lokesh
Davos
Andhra Pradesh

More Telugu News