Abhishek Sharma: రెండో భారతీయ బ్యాటర్‌గా అభిషేక్ శ‌ర్మ అరుదైన రికార్డు.. గురువు యువీ త‌ర్వాత మ‌నోడిదే ఆ ఘ‌న‌త‌!

Abhishek Sharma Just Behind His Mentor Yuvraj Singh Becomes Second Fastest Indian To
  • నిన్న‌టి మ్యాచ్‌లో అభిషేక్ శ‌ర్మ తుపాన్ ఇన్నింగ్స్‌
  • 34 బంతుల్లోనే 79 పరుగులు చేసిన యువ ఓపెన‌ర్
  • కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ (50) న‌మోదు 
  • ఇంగ్లండ్‌పై ఫాస్టెస్ట్ ఫిఫ్టీ న‌మోదు చేసిన రెండో భారతీయ బ్యాటర్‌గా రికార్డు
  • 2007 టీ20 ప్రపంచ కప్‌లో 12 బంతుల్లోనే అర్ధ శ‌త‌కం బాదిన యువ‌రాజ్‌
ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ లో భాగంగా బుధ‌వారం నాడు కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ లో తొలి టీ20 జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య భార‌త జ‌ట్టు ఘ‌న విజ‌యం సాధించింది. ఇంగ్లీష్ జ‌ట్టు నిర్దేశించిన‌ 133 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం 12.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. 

టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశ‌మే హ‌ద్దుగా చెలరేగాడు. ఈ యంగ్ బ్యాట‌ర్ కేవ‌లం 34 బంతుల్లోనే 79 పరుగులు చేశాడు. అత‌ని తుపాన్ ఇన్నింగ్స్ లో ఏకంగా 8 సిక్స‌ర్లు, 5 ఫోర్లు న‌మోద‌య్యాయి. అభిషేక్ కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ (50) న‌మోదు చేయ‌డం విశేషం. 

దీంతో ఇంగ్లండ్‌పై అత్యంత వేగవంతమైన అర్ధ శ‌త‌కం న‌మోదు చేసిన రెండో భారతీయ బ్యాటర్‌గా అభిషేక్ రికార్డులకెక్కాడు. 2007 టీ20 ప్రపంచ కప్‌లో యువ‌రాజ్ సింగ్ కేవ‌లం 12 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే. దాంతో ఈ ఫీట్ సాధించిన అతని గురువు యువీ తర్వాత అభిషేక్ నిలిచాడు. ప్ర‌స్తుతం ఈ యంగ్ ప్లేయ‌ర్‌కు యువ‌రాజ్ మెంటార్‌గా ఉన్నాడు. 

అలాగే ఈ మ్యాచ్ ద్వారా అభిషేక్‌ మ‌రో అరుదైన రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఒక మ్యాచ్‌లో అత్య‌ధిక సిక్సులు (8) కొట్టిన మూడ‌వ భార‌త బ్యాట‌ర్‌గా నిలిచాడు. ఇక అభిషేక్ శ‌ర్మ‌ గ‌తేడాది జింబాబ్వేపై మ్యాచ్‌తో త‌న టీ20 కెరీర్‌ను ప్రారంభించాడు. మొద‌టి మ్యాచ్ లోనే సెంచరీతో అంద‌రీ దృష్టిని ఆక‌ర్షించాడు. 

కానీ, ఆ తర్వాత అతను అనుకున్న స్థాయిలో రాణించ‌లేదు. ఈ క్ర‌మంలో నిన్న‌టి మ్యాచ్‌లో మ‌రోసారి కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పటి వరకు అభిషేక్‌ 13 టీ20ల్లో 27.91 సగటు, 183.06 స్ట్రైక్ రేట్‌తో 335 పరుగులు చేశాడు.
Abhishek Sharma
Yuvraj Singh
Team India
England
Cricket
Sports News

More Telugu News