YS Sharmila: అదానీపై చర్యలకు భయపడుతున్నారనేది నిజం: చంద్రబాబుపై షర్మిల ఫైర్

Chandrababu is afraid of taking action on Adani says YS Sharmila
  • అదానీపై చర్యలకు చంద్రబాబుకు కచ్చితమైన సమాచారం కావాలంట అని షర్మిల ఎద్దేవా
  • అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చిందని వ్యాఖ్య
  • తక్షణమే ఏసీబీని రంగంలోకి దించాలని డిమాండ్
గౌతమ్ అదానీపై చర్యలకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కచ్చితమైన సమాచారం కావాలట అని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. సమాచారం ఉంటేనే చర్యలు తీసుకుంటారట అని ఎద్దేవా చేశారు. బాబు గారి మాటలు ఈ దశాబ్దపు అతి పెద్ద జోక్ అని అన్నారు. 

నాడు ప్రతిపక్షంలో ఉండగా ఏ సమాచారంతో విద్యుత్ ఒప్పందాలపై కోర్టుకి వెళ్ళారు? అదానీతో చేసుకున్న ఒప్పందాల్లో అవినీతి దాగి ఉందని ఎందుకు అన్నారు? అదానీ పవర్ ఎక్కువ రేటు పెట్టి కొనడంతో రాష్ట్ర ప్రజలపై లక్ష కోట్ల రూపాయలు భారం పడిందని ఎందుకు చెప్పారు? తాడేపల్లి ప్యాలెస్ వేదికగా రాష్ట్రాన్ని అదానీకి దోచి పెడుతున్నారు అని ఎందుకు ఆరోపణలు చేశారు? అని ప్రశ్నించారు.

ప్రతిపక్షంలో ఉండగా అదానీ మీకు శత్రువు... అధికారంలోకి రాగానే అదే అదానీ మిత్రుడయ్యాడని షర్మిల విమర్శించారు. గత ప్రభుత్వం సెకీతో చేసుకున్న ఒప్పందంలో అవినీతి జరిగిందని, అదానీ పవర్ తో చేసుకున్న అగ్రిమెంట్ వెనుక స్వయంగా మాజీ ముఖ్యమంత్రి (జగన్) రూ. 17 వందల కోట్లు ముడుపులు తీసుకున్నారని అమెరికన్ దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చిందని తెలిపారు. 

అమెరికన్ కోర్టుల్లో అదానీపై కేసులు కూడా పెట్టారని... ఇంత తతంగం నడుస్తుంటే, అన్ని ఆధారాలు కళ్ళ ముందు కనిపిస్తుంటే, అదానీ మోసానికి రాష్ట్రమే అడ్డాగా మారితే, మాజీ ముఖ్యమంత్రి నేరుగా అవినీతిలో భాగంగా ఉంటే, కచ్చిత సమాచారం కావాలని చంద్రబాబు అడగటం రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నట్లేనని అన్నారు.

అధికారం దగ్గర పెట్టుకుని నిజాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యతను మరిచారని దుయ్యబట్టారు. కనీసం ఒప్పందాల్లో ఏం జరిగిందో తేల్చడానికి ఏసీబీని సైతం రంగంలోకి దించకపోవడం... అదానీని కాపాడుతున్నారు అనే దానికి నిదర్శనమని చెప్పారు. అదానీపై చర్యలకు భయపడుతున్నారు అనేది నిజమని... మోదీ డైరెక్షన్ లో విషయాన్ని పక్కదారి పట్టించారు అనేది వాస్తవమని అన్నారు. 

అదానీతో మీకు కూడా రహస్య అజెండా లేకపోతే, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు మీకు ముఖ్యం అనుకుంటే, లక్ష కోట్ల రూపాయలు భారం పడే అదానీ విద్యుత్ ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. అదానీ వ్యవహారంపై ఏసీబీని రంగంలోకి దించాలని అన్నారు. నిజానిజాలు ఏంటో నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు.
YS Sharmila
Congress
Chandrababu
Telugudesam
Gautam Adani

More Telugu News