Duvvuru Nageswar Reddy: ఏఐజీ చైర్మన్ నాగేశ్వర్‌రెడ్డికి అరుదైన గౌరవం.. దేశంలో మూడు ‘పద్మ‘ పురస్కారాలు అందుకున్న ఏకైక వైద్యుడిగా రికార్డ్

Dr D Nageswar Reddy is only doctor who got there Padma awards
  • నాగేశ్వరరావుకు ఇప్పటికే పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు
  • పెరోరల్ ఎండోస్కోపిక్ మయోటమీ‌ను పరిచయం చేసిన తొలి వైద్యుడిగా గుర్తింపు
  •  ప్రపంచ ఎండోస్కోపీ ఆర్గనేషజేషన్‌కు తొలి భారతీయ అధ్యక్షుడిగా సేవలు
  • కొవిడ్‌పై పోరులో నాగేశ్వరరావు బృందం అపార సేవలు
హైదరాబాద్‌లోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) ఆసుపత్రి చైర్మన్, గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్య నిపుణుడు డాక్టర్ దువ్వూరి నాగేశ్వరరెడ్డి దేశంలోనే అత్యంత అరుదైన రికార్డు సాధించారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆయనకు దేశంలోని రెండో అత్యున్నత పౌరపురస్కారమైన ‘పద్మవిభూషణ్’ను ప్రకటించింది. ఇప్పటికే ఆయన ‘పద్మశ్రీ’, ‘పద్మభూషణ్’ అవార్డులు అందుకున్నారు. తాజాగా పద్మవిభూషణ్ కూడా రావడంతో మూడు పద్మ పురస్కారాలు అందుకున్న ఏకైక వైద్యుడిగా రికార్డులకెక్కారు.

డాక్టర్ నాగేశ్వరరెడ్డిది విశాఖపట్నం. కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, మద్రాస్ మెడికల్ కాలేజీలో ఎండీ, చండీగఢ్‌లోని పీజీఐఎంఈఆర్‌లో డీఎం పూర్తిచేశారు. హైదరాబాద్ నిమ్స్‌లో గ్యాస్ట్రో ఎంటరాలజీ నిపుణుడిగా సేవలు అందించిన ఆయన ఆ తర్వాత ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆసుపత్రిని స్థాపించారు. వైద్యంలో సరికొత్త ఆవిష్కరణలు, విద్య, పరిశోధన, రోగుల సేవలకు తన జీవితాన్ని ఆయన అంకితం చేశారు. 

ప్రస్తుతం ఏఐజీ ఆసుపత్రి 40 రకాల సేవలు అందిస్తోంది. పెరోరల్ ఎండోస్కోపిక్ మయోటమీ (పీవోఈఎం)ను పరిచయం చేసిన తొలి వైద్యుడిగా నాగేశ్వరరెడ్డి పేరు సంపాదించారు. ఎండోస్కోపీ పిత్తవాహిక చికిత్స కోసం ఉపయోగించేందుకు నాగిస్టంట్‌ను అభివృద్ధి చేశారు. ప్రపంచ ఎండోస్కోపీ ఆర్గనైజేషన్‌కు తొలి భారతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవల కోసం ఏషియన్ హెల్త్‌కేర్ ఫౌండేషన్ (ఏహెచ్‌ఎఫ్)ను స్థాపించారు. 

కరోనా సమయంలో డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి, ఆయన బృందం వైరస్‌పై పోరాటంలో కీలకంగా వ్యవహరించింది. అలాగే, కొవిడ్-19 రోగుల్లో జీర్ణాశయాంతర సమస్యలపై చికిత్సలకు ప్రొటోకాల్‌ను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు. మాస్టర్ ఆఫ్ ది వరల్డ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఆర్గనైజేషన్ అవార్డు, జీర్ణాశయాంతర ఎండోస్కోపీ రంగంలో అత్యున్నత గౌరవమైన రుడాల్ఫ్ వి.షిండ్లర్ అవార్డులు అందుకున్నారు. నాగేశ్వరరెడ్డి భార్య క్యారల్ యాన్‌రెడ్డి డెర్మటాలజిస్ట్‌గా సేవలు అందిస్తున్నారు. 
Duvvuru Nageswar Reddy
AIG
Padma Bhushan

More Telugu News