Dr Nageswar Reddy: నాగేశ్వర్ రెడ్డి మంచి హస్తవాసి ఉన్న డాక్టర్: జగన్

Jagan congratulates Dr Nageswar Reddy for being conferred with Padma Vibhushan
  • పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం
  • ఏఐజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్
  • శుభాకాంక్షలు తెలిపిన జగన్
ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) వైద్య సంస్థ చైర్మన్, ప్రఖ్యాత వైద్య నిపుణుడు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం  పద్మవిభూషణ్ ప్రకటించింది. దీనిపై ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ స్పందించారు. 

"విఖ్యాత వైద్యుడు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ ప్రకటించిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గ్యాస్ట్రో ఎంటరాలజీ రంగంలో చేసిన పరిశోధనలు వైద్య రంగంలో గొప్పగా నిలిచిపోతాయి. ఆయన మంచి హస్తవాసి ఉన్న వైద్యుడు. రోగులకు ఆత్మీయతను పంచడమే కాకుండా, వారు కోలుకుని మామూలు మనుషులు అయ్యేందుకు వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే గొప్ప మనసు ఆయన సొంతం.

కొత్త కొత్త జబ్బులకు చికిత్స అందించడంలో నాగేశ్వర్ రెడ్డి సేవలు విశేషమైనవి. అత్యాధునిక వైద్య పద్ధతులు, చికిత్సా విధానాలను తెలంగాణ, ఏపీ సహా దేశమంతా విస్తరించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అటువంటి డాక్టర్ నాగేశ్వర్ రెడ్డిని దేశం గొప్పగా గౌరవించుకోవడం తెలుగు వారందరికీ గర్వకారణం" అని జగన్ వివరించారు. 

పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారందరికీ శుభాకాంక్షలు

ఇక, ఇతర పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగు వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నానని జగన్ మరో ట్వీట్ లో వెల్లడించారు. నందమూరి బాలకృష్ణ (కళలు), మంద కృష్ణ మాదిగ (ప్రజా వ్యవహారాలు), మాడుగుల నాగఫణి శర్మ (కళలు), కేఎల్ కృష్ణ (విద్య, సాహిత్యం), మిరియాల అప్పారావు (కళలు), వాదిరాజు రాఘవేంద్రాచారి పంచముఖి (విద్య, సాహిత్యం) తదితరులకు శుభాకాంక్షలు తెలుపుతున్నానని పేర్కొన్నారు.
Dr Nageswar Reddy
Padma Vibhushan
Jagan
AP
Telangana
YSRCP

More Telugu News