AP Railway Stations: ఏపీలో 73 రైల్వే స్టేషన్లకు కొత్త రూపు: అశ్విని వైష్ణవ్

Aswini Vaishnaw says Centre will modernize 73 railway station in AP
  • ఏపీలో రూ.84,559 కోట్ల విలువైన రైల్వే పనులు జరుగుతున్నాయన్న కేంద్రమంత్రి
  • అందుకే బడ్జెట్ లో ఏపీ పేరు ప్రస్తావించలేదని వెల్లడి
  • ఏపీలో రైల్వే పనులకు సీఎం చంద్రబాబు విశేష సహకారం అందిస్తున్నారని కితాబు
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నేడు ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. పలు రాష్ట్రాల్లో రైల్వే పనులు జరుగుతున్న తీరును ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఏపీ రైల్వే ప్రాజెక్టుల ప్రస్తావన తీసుకువచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ.84,559 కోట్ల విలువైన రైల్వే పనులు ఇప్పటికే జరుగుతున్నాయని వెల్లడించారు. అందుకే బడ్జెట్ లో ప్రత్యేకంగా ఏపీ గురించి ప్రస్తావించలేదని వివరణ ఇచ్చారు. 

రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధికి రూ.9,417 కోట్లు కేటాయించామని తెలిపారు. యూపీఏ హయాంలో కేటాయించిన నిధుల కంటే 11 రెట్లు అధికంగా నిధులు కేటాయించామని చెప్పారు.

ఇక, ఏపీలో 73 రైల్వే స్టేషన్ల రూపురేఖలను పూర్తిగా మార్చివేస్తున్నామని వెల్లడించారు. ఆయా రైల్వే స్టేషన్లను ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతామని తెలిపారు. 

మున్ముందు ఏపీకి మరిన్ని వందేభారత్ రైళ్లు కేటాయిస్తామని... ప్రస్తుతం ఏపీలోని 16 జిల్లాల మీదుగా 8 వందేభారత్ రైళ్లు తిరుగుతున్నాయని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వివరించారు. అన్ని రైళ్లు గంటకు 110 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా ఏపీలో అన్ని రైల్వే ట్రాక్ లు సిద్ధం చేస్తున్నామని... కొన్ని మార్గాల్లో గంటకు 130 నుంచి 160 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా ట్రాక్ లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 

రాష్ట్రంలో రైల్వే పనులు సత్వరమే జరిగేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంపూర్ణ సహకారం అందిస్తున్నారని కొనియాడారు.
AP Railway Stations
Aswini Vaishnaw
Indian Railways
Andhra Pradesh

More Telugu News