Prices: ధరల పర్యవేక్షణపై ఏపీ మంత్రుల కమిటీ సమావేశం... వివరాలు ఇవిగో!

Ministers committee held meeting on prices supervision
  • మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన సమావేశం
  • హాజరైన ఆర్థిక, వ్యవసాయ, ఆరోగ్య శాఖ మంత్రులు
  • మార్కెట్ ధరలు, ద్రవ్యోల్బణం నివారణకు చర్యలపై చర్చ
  • అధికారులకు దిశానిర్దేశం
రాష్ట్ర  ఆహారం, పౌరసరఫరాలు, వినియోగదారుల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ధరల పర్యవేక్షణపై మంత్రుల కమిటీ సమావేశం జరిగింది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్,  ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

మార్కెట్ ధరలపై నిత్యం పర్యవేక్షణ, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు, మిల్లెట్ల (తృణధాన్యాలు) ప్రోత్సాహం, ప్రస్తుత మార్కెట్ లో ధరల పరిస్ధితిని సమీక్షించారు. మంత్రుల కమిటీ స్పందిస్తూ... డిసెంబర్ 2024లో ఆంధ్రప్రదేశ్‌ ద్రవ్యోల్బణం రేటు 4.34% కాగా, జాతీయ సగటు 5.22% కంటే తక్కువగా ఉందని వెల్లడించింది. ప్రభుత్వం 154 మండల కేంద్రాల్లోని సీపీ యాప్ ద్వారా ప్రతీరోజూ ధరల సేకరణ, విశ్లేషణ చేస్తోందని వివరించింది. అదేవిధంగా 151 రైతు బజార్ ధరలను విశ్లేషించడం జరుగుతుందని పేర్కొంది.

కాగా, ఆంధ్రప్రదేశ్‌లో 69 నిత్యావసర సరుకుల ధరలను క్రమం తప్పకుండా పర్యవేక్షించనున్నారు. వీటిలో ధాన్యాలు, కూరగాయలు, వంటనూనెలు, మసాలాలు ఉన్నాయి. గత ఏడాదితో పోల్చితే... కందిపప్పు (13%), గ్రౌండ్‌నట్ ఆయిల్ (4%), మిర్చి (27%) ధరలు తగ్గాయి. ఏపీ మిషన్ మిల్లెట్ వంటి పథకాల ద్వారా జొన్నలు, రాగులను ప్రోత్సహించేందుకు నిర్ణయించారు. 

మిడ్-డే మీల్స్, సంక్షేమ పథకాలలో మిల్లెట్లు చేర్చడం, అదే విధంగా మిల్లెట్ వాడకాన్ని ప్రోత్సహించడంపైనా అధికారులకు దిశానిర్దేశం చేశారు. రైతులకు ధరల సమాచారం ఎప్పటికప్పుడు అందించేందుకు చర్యలు తీసుకోనున్నట్టు మంత్రుల కమిటీ పేర్కొంది. 

రాష్ట్ర వ్యాప్తంగా రవాణా ఖర్చులు అధికంగా ఉండడం కొన్ని ప్రాంతాల్లో ధరలు పెరగడానికి కారణం కావడంతో... ధరల అదుపుకు తగు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు మంత్రుల కమిటీ ఆదేశాలు జారీ చేసింది.
Prices
Ministers Committee
Nadendla Manohar
Payyavula Keshav
Atchannaidu
Sathya Kumar
TDP-JanaSena-BJP Alliance

More Telugu News